calender_icon.png 20 November, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒంటరి వృద్ధులకు చేయూత, భరోసా

20-11-2025 12:00:00 AM

  1. హైదరాబాద్‌లో వృద్ధుల కోసం ‘సీనియర్ సాథీ’ ప్రారంభం 
  2. యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
  3. తల్లిదండ్రులను చూసుకోని ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తాం
  4. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 19 (విజయక్రాంతి): మారుతున్న జీవనశైలి, అణుకుటుంబాల నేపథ్యంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వయోవృద్ధులకు అండగా నిలిచేందుకు సీనియర్ సాథీ అనే బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్‌లో శ్రీకారం చుట్టారు. యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్ కలెక్టరేట్ లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ చాలా మంది వృద్ధులు ఒంటరిగా, నిరాదరణకు గురవుతున్నారు.. ఇలాంటి వారికి ‘సీనియర్ సాథీ’ అండగా నిలవడం అభినందనీయం అని అన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు. సీనియర్ సిటిజన్స్ చట్టాన్ని కఠినంగా అమలు చేసి, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

వృద్ధులు సులభంగా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని, ఎవరు ఎప్పుడు ట్రాప్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది, దీనిపై వారికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి, అని మంత్రి సూచించారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన సీనియర్ సాథీ కార్యక్రమం రాష్ర్టవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించి, దేశానికే రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అరుణ్, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ బోర్డు ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.