28-07-2025 06:45:05 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం మండల స్థాయి టీచర్ సెంటర్ క్లాస్, రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి(District Education Officer Venkateswara Chari) తరగతులను సోమవారం రోజు పరిశీలించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, నూతన విద్యాపర అంశాలను ఎప్పటికప్పుడు నేర్చుకునే ప్రయత్నం కొనసాగించాలని కోరారు. టీచింగ్ సెంటర్ తరగతుల ఆధారంగా, అనేక నూతన విద్యా అంశాలను నేర్చుకోవచ్చని తెలిపారు. ఇలాంటి విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డీఈఓ వెంకటేశ్వర చారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న దృష్ట్యా, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం డీఈఓను ఘనంగా సన్మానించారు. ఉద్యోగంలో చేరిన ప్రతివారికి ఉద్యోగ విరమణ సర్వసాధారణనీ, జిల్లా విద్యాశాఖ అధికారిగా చారి, ప్రతి విద్యాకార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారని, తప్పనిసరి పరిస్థితుల్లో డీఈఓగా చేరి తన విధులను, సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేశారని మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభు దయాల్ పేర్కొన్నారు. అన్ని రంగాలను ప్రభావితం చేసేదే విద్యారంగం, ప్రతి ఒక్కరు, విలువలు గల విద్యా వ్యాప్తికై కృషి చేయాలని, విద్యార్థుల సంక్షేమం నిమిత్తం అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఈ తరగతుల్లో మండల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, స్కూలు కాంప్లెక్స్ హెచ్ఎం లు, సిఆర్పిలు, రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.