19-12-2025 12:22:31 AM
రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలి
ఖమ్మం నగరం 14వ డివిజన్ లో బీటి రోడ్డు, సిసి రోడ్లు,
డ్రైన్‌ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల
ఖమ్మం, డిసెంబర్ 18 (విజయ క్రాంతి): ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మంత్రి, గురువారం ఖమ్మం నగరం 14వ డివిజన్ గోపాలపురం నందు 2 కోట్ల 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన బీటి, సిసి రోడ్లు, డ్రైన్ ల అభివృద్ధి పనులకు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ప్రజలకు అవసరమైన మౌళిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి సంపూర్ణంగా సహకరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం భూ కబ్జాదారులు, రౌడీలను నగరానికి దూరంగా పెట్టడం జరిగిందని అన్నారు. ప్రస్తుత పాలనలో అక్రమ కేసులు, భూ కబ్జాలు, మట్కా, గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఉండవని మంత్రి స్పష్టం చేశారు.
గంజాయి వల్ల మన బిడ్డలు నాశనం అవుతారని, దౌర్భాగ్యులు సంపాదన కోసం చిన్న పిల్లలకు గంజాయి చాక్లెట్లు అలవాటు చేసే దుస్థితి వచ్చిందని, దీనిని నియంత్రించడానికి ప్రజలు సంపూర్ణంగా సహకారం అందించాలని మంత్రి కోరారు. ఖమ్మం నగర అభివృద్ధికి ప్రభుత్వం 50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, జనవరి నెలలో మరో 50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఉపయోగకరమైన పనులు నగరంలో చేపడుతున్నామని, ఈ పనులను స్థానిక నాయకులు, అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించి నాణ్యతతో, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు.
గోపాలపురంలో శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు మూడు నెలల లోగా పూర్తి చేయాలని, అభివృద్ధి పనులు పూర్తి కాని పక్షంలో మరిన్ని నిధులు మంజూరు కావని, చేసే పనిలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పది కాలాల పాటు చేసిన పని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని మంత్రి తెలిపారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయాలని, రాజకీయంగా ఎటువంటి వివక్ష చూపాల్సిన అవసరం లేదని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంత రావు, కార్పొరేటర్లు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఇర్రిగేషన్ ఇఇ అనన్య, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.