calender_icon.png 19 December, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం

19-12-2025 12:20:49 AM

  1. నూతన ప్రజాప్రతినిధులు  గ్రామాలలో మెరుగైన పాలన అందించాలి
  2. విజేతలకు మంత్రి పొంగులేటి అభినందనలు 
  3. ఎమ్మెల్యే పాయం ఆధ్వర్యంలో  భారీగా కొత్తగూడెం తరలిన  ప్రజాప్రతినిధులు

మణుగూరు, డిసెంబర్18 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ సంక్షేమ పాలన గ్రామాలలో ప్రజలు జై కొట్టి ఆశీర్వదించారని, భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని, ఇది ఇందిరమ్మ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం  చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు.

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం లో  కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి  ఘనవిజయం సాధించిన ప్రజా ప్రతినిధులు, ఈ భేటీలో మంత్రి పొంగులేటికి  పుష్పగుచ్ఛాలు అందజేయగా, మంత్రి వారిని శాలువాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గ్రామాల్లోని సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఉత్తమ సేవలందించాలని ఆయన కోరారు. రాజకీయాల్లో ఏ పార్టీ జెండా ఎగరాలన్నా, ఏ నాయకుడి భవిష్యత్తు మారాలన్నా దానికి గ్రామ స్థాయి కార్యకర్తలే పునాది అని కొనియాడారు. గత పదేళ్లలో మునుపటి ప్రభుత్వం అప్రజాస్వామికంగా, కుట్రలతో వ్యవహరించిందని, కానీ తమ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించి గ్రామ స్థాయి నాయకత్వాన్ని బలపరిచిందని పేర్కొన్నారు.

పంచాయతీ ఫలితాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి తీవ్రంగా ఖండించారు. ఓటమిని జీర్ణించు కోలేక గులాబీ పార్టీ పత్రికల్లో అంకెలగారడీ చేస్తూ ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టు కుంటామని మంత్రి పునరుద్ఘాటించారు. గడిచిన రెండేళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఈ విజయానికి సోపానాలని ఆయన పేర్కొన్నారు.

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితం పునరావృతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన ఆశయమని, ఈ అభివృద్ధి ప్రస్థానంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరమని మంత్రి  పేర్కొన్నారు.

గ్రామాలకు అవసరమైన నిధులు, అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్ని కల్లో కూడా ఇదే ఉత్సాహంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్త లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.