03-09-2025 11:53:23 PM
ప్రధాన భూమిక పోషించారు
విలేకరుల సమావేశంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేసిన కొందరిలో సర్గీయ జగదీశ్వర్ రెడ్డి కంకణ బద్ధులై పనిచేశారని నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి అన్నారు. గురువారం జగదీశ్వర్ రెడ్డి వర్థంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో వారి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెక్కెరి మధుసూదన్ రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అభిమానులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి ఆదర్శప్రాయుడన్నారు. మహబూబ్ నగర్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెక్కరి మధుసూదన్ రెడ్డి నివాసంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జగదీశ్వర్ రెడ్డి ఎంతో సౌమ్యుడని ఆయన చెప్పారు. ఆయనతో 2004 నుంచి కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా అప్పుడు వారు అధికార పక్షంలో ఉన్నప్పటికీ, ప్రతి పక్షంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్న మాకు అన్ని విధాలా సహాకరించారని అన్నారు.
పాలమూరు యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో కూడా ఆయన నాడు చూపిన చొరవ గొప్పదని అన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారన్నారు. మహబూబ్ నగర్ లో పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని పోయేవారని, రాజకీయం చేసే అందరికీ ఆయన పెద్దన పాత్రపోషించారన్నారు. ఆయన చూపిన మార్గంలో మనం నడిచి నిజమైన నివాళి అర్పిద్దామని ఆయన సూచించారు. గురువారం స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా భారిగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం పద్మావతి కాలనీ లోని గ్రీన్ బెల్ట్ దగ్గర జగదీశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణ చేసే ప్రదేశాన్ని వారు సందర్శించారు.