13-10-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాజన్న భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధిపై ఆలయ ఆవరణలోని చైర్మెన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్ ఆదివారం మాట్లాడారు.
శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి, వాస్తు, పండితులు, అర్చకులు పట్టణ ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రూ. 150 కోట్లతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు మొదలు అయ్యాయని వివరించారు. రూ. 47 కోట్లతో ప్రధాన రహదారి విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించామని వివరించారు.
రాజన్న భక్తులకు సులభంగా వేగంగా దర్శనం, వసతి కల్పించాలని ఉద్దేశంతో ఆలయ అభివృద్ధి, విస్తరణ నేపథ్యంలో భీమేశ్వరాలయంలో మొక్కులు, ఇతర పూజలు చేసుకునేందుకు రూ. 3. కోట్ల 48 లక్షలతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు యధావిధిగా అన్ని పూజలు, అభిషేకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
రాజన్న ఆలయంలో భారీ యంత్రాలతో పనులు జరిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. భక్తుల భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ అనేది భక్తుల ఎజెండా అని పేర్కొన్నారు.
భక్తుల కోసం ఎవరు ఎలాంటి సూచనలు చేసిన తప్పకుండా గౌరవిస్తామని స్పష్టం చేశారు.అందరి సలహాలు సూచనల మేరకు పనులు చేపడుతామని విప్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చేయిస్తున్న పనులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు..