23-07-2025 01:29:24 AM
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్ అన్నారు. డివిజన్లోని చిక్కడపల్లి లోని బాపునగర్ లో ఉన్న మహిళా భవన్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్, ని వి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు, మగ్గంలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.
ఇప్పటి నాలుగు బ్యాచ్ లు పూర్తి చేసుకున్న శిక్షణ కేంద్రంలోని మహిళలకు లయన్స్ క్లబ్ ప్రతినిధి కల్లూరి శ్రీనివాస్ ‘పికొ మిషన్ లను‘ అందచేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కొరకు డివిజన్ లో రెండు చోట్ల ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సహకరించిన లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
వారితో పాటు తమ నివి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మరిన్ని ఉచిత శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ అధ్యక్షులు చంద్రమోహన్, కార్యదర్శులు సుమన్, కోశాధికారి విజయేందర్ రెడ్డి, ప్రాజెక్టు ఛైర్మెన్ సెరిపల్లి గణేష్, సభ్యులు కమలాకర్, కాసం, హేమంత్, ప్రకాష్, బీజేపీ నేతలు దామోదర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.