23-07-2025 06:04:52 PM
మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి..
మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని ఫెర్టిలైజర్ డీలర్లు ఎరువులను నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు అమ్మినా, ఇతర ఎరువులను కలిపి అమ్మినా కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి(Mandal Agriculture Officer G Kiranmayi) హెచ్చరించారు. మండలంలోని ఎరువుల దుకాణాలను, పిఎసిఎస్ గోదామును బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలో స్టాక్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ఎరువుల డీలర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రతీ ఎరువుల దుకాణములో స్టాకు నిలువలు ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.
రైతులు యూరియా, ఎరువుల కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వానాకాలం సీజన్ కు గాను సరిపడా స్టాకును జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు తెప్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు అధిక మోతాదులో ఎరువులను వాడి పంట భూములను నిస్సారం చేయకూడదని అదే విధంగా రైతులు నానో యూరియా, నానో డీఎపీ లపై మొగ్గు చూపాలని కోరారు. ప్రస్తుత వానాకాలం సీజన్ కు గాను రైతులకు కావలసినవి అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. వ్యవసాయానికి సంబంధించన సందేహాలు, సలహాలకు మండల వ్యవసాయ అధికారిని లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి మేలైన పంట దిగుబడులు పొందాలని కోరారు.