23-07-2025 06:08:38 PM
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి(CM Revanth Reddy) రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని కులాల వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై సర్వే చేశామని రేవంత్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. సర్వే ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు రూపొందించామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించామని చెప్పారు. బిల్లుల ఆమోదం కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని సూచించారు. ఇండియా కూటమిలోని నేతలను కూడి కలిసి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన కులగణన విధానాన్ని లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు వివరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనగణన, కులగణన చేపట్టనుందన్నారు. కేంద్రం చేపట్టే కులగణనకు తెలంగాణ చేసిన కులగణన సర్వే(Caste Census Survey) నమూనాగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణలో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కేంద్రం త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సూచించారు.
బీజేపీ నాయకత్వం ద్వందవైఖరి అవలంబిస్తోందని సీఎం ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఇప్పుడు మరోమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముస్లింల శాతాన్ని తీసివేయాలని కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy), బండి సంజయ్ అంటున్నారన్న సీఎం బీజేపీ రాష్ట్రాలకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయం ఉంటుందా?, యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లకు బీజేపీ ఎందుకు తొలగించటం లేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాల క్రితం నుంచి గుజరాత్ లో ముస్లిం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గతంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక వర్గం పేరు చెప్పి తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. సర్వేలో వ్యక్తిగత వివరాలను వెల్లడించలేదని తెలిపారు. 3.99 శాతం మంది తమకు ఏ కులం లేదని సర్వేలో చెప్పారని పేర్కొన్నారు.
స్వతంత్ర నిపుణుల అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే తాము ముందుకెళ్తున్నామని వివరించారు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని కుట్ర చేస్తున్న వాళ్లే సందేహాలు లేవనెత్తున్నారని విమర్శించారు. కులగణన సర్వే డేటా కావాలంటే ఆయా పార్టీల ముందు, అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు. మత ప్రాతిపాదికన ఎలాంటి రిజర్వేషన్లు ఇవ్వటం లేదన్నారు. కేవలం సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటు ఆధారంగా 42 శాతం రిజర్వేషన్లు తెచ్చామన్నారు. యూపీలో 5 ముస్లిం కులాలు రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నాయని పేర్కొన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారని చెప్పారు. రైతుల చట్టాల రద్దు స్పూర్తిగా బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం కోసం పోరాడుతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కూడా కేంద్రం మొదట ఒప్పుకోలేదన్న సీఎం కాంగ్రెస్ తెచ్చిన ఒత్తిడితో జనగణనతో కులగణన చేసేందుకు ఒప్పుకుందన్నారు.
బీసీల వెనుకబాటుతనతం గురించి మండల్ కమిషన్ కూడా దశాబ్దాల క్రితమే నివేదిక ఇచ్చిందని చెప్పారు. జనగణనతో పాటు కులగణన చేసేందుకు కేంద్రం ఇప్పటికీ చిత్తశుద్ధితో లేదని ఆరోపించారు. తెలంగాణలో ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినోత్సవంగా పాటించామన్నారు. ముస్లింల పేరుతో మరోసారి భావోద్వేగ రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందన్న ఆయన తాము కల్పించే రిజర్వేషన్లలో మతం ప్రస్తావనే లేదని చెప్పారు. కేవలం సామాజిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తేల్చిచెప్పారు.
బీసీ అయిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలి
బీసీలకు అన్యాయం చేసేలా గతంలో కేసీఆర్ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దన్న నిబంధనను బీజేపీ ఎప్పుడో తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం నిబంధన ఎప్పుడో దాటిపోయిందని చెప్పారు. ఓబీసీలకు న్యాయం చేయాలని బీజేపీని కూడా కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ అయిన బండారు దత్తాత్రేయను ఉపరాష్టపతిని చేయాలని కోరారు. ఇప్పటికే బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని చెప్పారు. కేంద్ర పదవుల్లో తెలంగాణ వాళ్లకు అన్యాయం, బీసీలకు అన్యాయం జరుగుతోందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతను తొలగించి.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మరోసారి ఓసీ నేతకే ఇచ్చారని పేర్కొన్నారు. గతంలోనూ దత్తాత్రేయను తొలగించి కిషన్ రెడ్డికి పదవి ఇచ్చారు. ముస్లింల పేరుతో బీజేపీ సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చూస్తోందని సీఎం చురకలంటించారు.