calender_icon.png 22 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మరాజు సహకారం మరువలేనిది

22-12-2025 12:30:05 AM

నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయ క్రాంతి): చింతకుంట ధర్మరాజు  భక్తి, సేవ, సామాజిక బాధ్యత అనే విలువలను జీవితాంతం పాటించిన మహానుభావుడని కొనియాడారు. నిజామాబాద్ పట్టణానికి ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచిన గోల్ హనుమాన్ ఆలయాన్ని వలయాకారంలో నిర్మించటం రాష్ట్రంలోనే అరుదైన విషయం అని తెలిపారు. ఇలాంటి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేదన్నారు. గోల్ హనుమాన్ ఆలయ నిర్మాణo లో కీలకపాత్ర వహించిన చింతకుంట ధర్మరాజు శతజయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు.

నిజామాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ గోల్ హనుమాన్ ఆలయ నిర్మాణo కీలకపాత్ర పోషించిన స్వర్గీయ చింతకుంట ధర్మరాజు శతజయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు  ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ధర్మరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధర్మరాజు సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో జీవించిన మేధావి, ఇంటలెక్చువల్ వ్యక్తి అని పేర్కొన్నారు. చదువుతోనే ఉన్నత స్థాయికి ఎదగవచ్చన్న ఆలోచనతో పట్టణంలో ఆర్యవైశ్య స్కూల్ను ప్రారంభించడంతో పాటు అద్భుతమైన డిజైన్తో మాణిక్ భవన్ను నిర్మించారని గుర్తు చేశారు.

మాణిక్ భవన్ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అనంతరం భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు హాజరుకావడం ధర్మరాజు వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు.గోల్ హనుమాన్ ఆలయ నిర్మాణంలో ధర్మరాజు  కీలక పాత్ర పోషించారని, సనాతన ధర్మ వ్యాప్తికి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ధర్మం సనాతన ధర్మమని, ధర్మం నిలబడితే సమాజం సురక్షితంగా ఉంటుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

తాను ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి చేరుకోవడంలో ధర్మరాజు ఆశీర్వాదం, చింతకుంట కుటుంబ ఆశీస్సులు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా యువత ధర్మరాజు అడుగుజాడల్లో నడిచి విద్య, సేవ, సమాజహితాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. చదువుతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయం చేయవచ్చని సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో చింతకుంట ధర్మరాజు కుమారులు చింతకుంట రాజేందర్ , చింతకుంట రవీందర్, గోల్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ బండారి నరేష్, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, ఉదయ్ మహారాజ్, మాణిక్ భవన్ అధ్యక్షులు పెద్ది సంగమేశ్వర్ గుప్తా , న్యాలం మోహన్‌రావు , మాధవరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.