calender_icon.png 22 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారిదే హవా..!

22-12-2025 01:03:29 AM

రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లదే హవా.!

డాక్యుమెంట్ రైటింగ్ పేరుతో అడ్డగోలుగా దోపిడి

సిబ్బంది కొరత సాకుతో ప్రైవేట్ వ్యక్తులు పాగా

ఒక్కో డాక్యుమెంట్ ఫీజు పది వేలకు పైగా వసూళ్లు

నాగర్ కర్నూల్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు హవా కొనసాగిస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉందన్న సాకుతో ప్రైవేట్ వ్యక్తులను ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిగా తీసుకోవడంతో ఇదే అదునుగా భావించిన సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్లతో చేతులు కలిపి సుమారు ఐదు నుండి 15వేల దాకా ముక్కు పిండి వసూలు చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ప్రభుత్వానికి చాలానా చెల్లింపుతో పాటు డాక్యుమెంట్ రైటింగ్ పేరుతో 2500 ఆఫీస్ ఖర్చులంటూ మరో రెండు వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కోర్టు కేసులు, ఎఫ్టిఎల్, ఎల్ ఆర్ ఎస్ వంటి లిటిగేషన్ ప్లాట్, కిరికిరి ప్లాట్లు వారికి కాసులు కురిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సుమారు 50 నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లను నేరుగా కొనుగోలుదారుకు ఇవ్వకుండా డాక్యుమెంట్ రైటర్లు స్వాధీనం చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్యాల యంలో సబ్ రిజిస్టార్ తో పాటు ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు ఒకరు అటెండర్, మరో ఇద్దరి స్టాఫ్ ఉన్నప్పటికీ డాక్యుమెంట్ రైటర్ లే ఆఫీసు అంతా నడిపిస్తున్నారని చర్చ జరుగుతోంది. 

డాక్యుమెంట్ రైటర్లకు కోడ్ లాంగ్వేజ్..

క్రయవిక్రయాలు జరిపే క్రమంలో నిబంధనలను అనుసరిస్తూ క్రయ విక్రయ ధార్ల పూర్తి చిరునామా, షరతులు, మార్కెట్ వ్యాల్యూ నమోదు, హద్దులు,, సర్వే నెంబర్లు పూర్తిస్థాయిలో పొందుపరుస్తూ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంది. ఇది సర్వ సాధారణంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్లో డాక్యుమెంట్ రైటింగ్ విధానాన్ని పొందుపరిచారు. వాటిని అనుసరిస్తూ డాక్యుమెంట్ తయారు చేసిన వాటిని రిజిస్ట్రేషన్ ఒప్పుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. రిజిస్టర్ కార్యాలయం ముందు సిండికేట్ గా మారిన డాక్యుమెంట్ రైటర్లు ద్వారా రాసిన వాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేసే ఓ వ్యక్తి డాక్యుమెంట్ రైటర్ల పేర్లతో కోడ్ లాంగ్వేజ్ ఏర్పాటు చేసి తిరిగి సాయంత్రం వాటి ఆధారంగానే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లన్నీ ఆయా డాక్యుమెంట్ రైటర్లు స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సబ్ రిజిస్టర్ కార్యాలయం మాత్రం కేవలం రిజిస్ట్రేషన్ కోసం మాత్రమే పనిచేస్తుందని విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా కల్వకుర్తి నాగర్ కర్నూల్ మీదుగా కొల్లాపూర్ సోమశిల సిద్దేశ్వరం జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భూముల ధరలతో పాటు ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి దీంతో ఆ ప్రాంతంలోని ప్లాట్లు క్రయవిక్రయాలు. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బందితోపాటు డాక్యుమెంట్ రైటర్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ సామాన్యులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. 

చర్యలు తీసుకుంటాం..

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర శూన్యం. క్రయవిక్రయాలు జరిపేవారు నేరుగా డాక్యుమెంట్ తయారు చేసుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేసేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. రిజిస్ట్రేషన్ అనంతరం ప్లాట్ విక్రయించిన వారికే ఓటీపీ ద్వారా డాక్యుమెంట్లను అందిస్తాం. అవుట్సోర్సింగ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం.                   

రాజేష్, సబ్ రిజిస్టర్,

నాగర్ కర్నూల్