calender_icon.png 22 December, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సమస్యలతో స్వాగతం..!

22-12-2025 12:29:43 AM

  1. రెండేళ్ల నిరీక్షణకు నేటితో తెర
  2. నేటి నుండే గ్రామాల్లో సర్పంచుల పాలన ప్రారంభం
  3. సమస్యలతో స్వాగతం పలకనున్న పల్లెలు
  4. అభివృద్ధి చేయాలంటున్న గ్రామస్తులు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 21(విజయక్రాంతి): గ్రామపంచాయతీల్లో నేటి(సోమవారం)నుంచి సర్పంచుల పాలన మొదలు కాబోతుంది.ఇందుకోసం పంచాయతీరాజ్ కమిషనర్ నేడు కొత్త పాలక వర్గాల ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 11,14,17 తేదీల్లో జరిగిన మూడు విడతల ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకున్నారు.

గెలిచిన అభ్యర్థులు నేటి నుంచి తమ పదవిలో ఆసీనులు కానున్నారు. గత రెండు సంవత్సరా లుగా ప్రత్యేక అధికారుల చేతుల్లో మగ్గిన గ్రామపాలన నేటితో విముక్తి పొందింది. నేడు నూతన సర్పంచులు కొలువుదీరనున్న సందర్భంగా సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కడ ఏ సమస్య లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

సమస్యల స్వాగతం..

రెండు సంవత్సరాలుగా నిధులు లేక గ్రామాల్లో చాలా సమస్యలు పేరుకుపోయాయి.నూతన సర్పంచులకు సమస్యల పరిష్కారం సవాలుగా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదలయితేనే సమస్యలకు పరిష్కారం లభించనుంది.

కార్యదర్శులపై ఆర్థిక భారం

రెండు సంవత్సరాలుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది.దీంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో నిర్వహణ బాధ్యతలు చూసుకోవడంతో ఆర్థికం గా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తెచ్చిపెట్టినా బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో జరిగిన మూడు విడతల ఎన్నికల ఖర్చు సైతం పంచాయతీ కార్యదర్శులే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండు సంవత్సరాల నిరీక్షణకు తెర

గత రెండు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలలో సర్పంచులు లేకపోవడంతో గ్రామాల్లో ఆలో టు స్పష్టంగా తెలిసింది. అయి తే గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని గ్రామాల్లో ప్రజా ప్రతిని ధులు, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు వేచి చూశారు. అయితే ఈరెండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామాల్లో ప్రధానమైన ఓట్ల పండుగకు తెరపడింది.

నూతనంగా ఏర్పాటవుతు న్న పాలకవర్గంపై గ్రామాలలో విద్య, వైద్యం, త్రాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుద్ధ్యం, కాల్వలు, వ్యవసాయ బావులు, చెరువుల అభివృద్ధి లాంటి మౌలిక సదుపాయాల అంశాలపై దృష్టి సాధించాల్సి ఉంది. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పనిచేయాలని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.