10-05-2025 06:36:29 PM
సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ
సూర్యాపేట,(విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న మెడికల్ మాఫియాని వెంటనే నిర్మూలించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిఎంహెచ్ఓను ఉన్నతాధికారులు టర్మినేట్ చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ మాఫియా రోజురోజుకు పెచ్చరిల్లి పోతుందని, దీనివలన సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతుందన్నారు. డీఎంహెచ్ఓగా డాక్టర్ కోటాచలం బాధ్యతలు స్వీకరించిన నాటినుండి మెడికల్ మాఫియాకు అడ్డు లేకుండా పోయిందన్నారు. ఆయన స్వార్థపూరితంగా అనర్హులకు హాస్పిటల్స్ పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన నిర్లక్ష్యం ఫలితంగా ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వీర్యం కావడంతో పాటు, మెడికల్ మాఫియా రెచ్చిపోతుందన్నారు. జిల్లాలో నకిలీ డాక్టర్లపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటో తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.