30-08-2025 01:38:39 AM
-విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుబ్బారావు
-విజ్ఞాన్‌లో ఉత్సాహభరితంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
- క్రీడలకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి
-యూనివర్సిటీ అడ్వైజర్ డాక్టర్ పూనం మాలకొండయ్య
హైదరాబాద్, ఆగస్టు29 (విజయక్రాంతి): హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించి దేశానికి గర్వకారణంగా నిలవాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుబ్బారావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఫిజికల్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఎలా మెరుగుపరుస్తుందో అదే విధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయని వివరించారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణత గల మనిషిగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. విజ్ఞాన్స్ యూనివర్సిటీలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఇక్కడ విద్యార్థులు ఏదో ఒక గేమ్‌ను ఎంపిక చేసుకొని ఆడాల్సిందేనన్నారు.
క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి: పూనం మాలకొండయ్య
ప్రస్తుత పోటీ ప్రపంచంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరమని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య చెప్పారు. చదువులు మాత్రమే కాకుండా క్రీడలలో చురుకుగా పాల్గొంటే శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం లభిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు మనలోని నాయకత్వ లక్షణాలు, ఓర్పు, నిర్ణయాత్మక శక్తిని పెంపొందిస్తాయని.. ఇవన్నీ భవిష్యత్‌లో మీరు ఎలాంటి రంగంలో ఉన్నా విజయానికి తోడ్పడతాయని వివరించారు.
అందుకే విద్యతో పాటు క్రీడలకూ సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్ఘాటించారు. క్రీడలు మానసిక వికాసానికి ఎంతో అవసరమని, మానసిక ఒత్తిడిలేని చదువుతో విద్యార్థులు మరింత ఎక్కువ చదువులో రాణిస్తారని చెప్పారు. దైనందిన జీవితంలో క్రీడలను ఒక భాగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, డైరెక్టర్లు, అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.