30-08-2025 01:41:04 AM
-కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బూ అంటూ సంభాషణలు
-సంచలనం రేపుతున్న వీడియో
-అప్రమత్తమైన పోలీసులు
-విచారణ జరుపుతున్నాం: జిల్లా ఎస్పీ
-పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్, ఆగస్టు 29(విజయక్రాంతి)ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని హత్య చేసేందుకు కొంతమంది కుట్ర పన్నారు.ఆ కుట్రకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేసే డబ్బే డబ్బుఅంటూ వీడియోలో సంభాషణలుఉన్నాయి. కోటంరెడి శ్రీధర్‌రెడ్డిని చంపాలని ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.
లేడి డాన్ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలేల శ్రీకాంత్, జగదీష్ తదితరులు పథకం రచించినట్లు కోటంరెడ్డి వర్గీయులు గుర్తించారు. ఆ వీడియోలో విపరీతంగా మద్యం సేవించి ఈ ప్లాన్ గూర్చి చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు వీడియోతో సహా సాక్ష్యాలు సైతం సేకరించారు. వెంటనే స్పందించడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ముప్పు తొలగిందని పేర్కొంటున్నారు.ఇటీవల ఆయనపై వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది.
కోటంరెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని అరుణకు వైసీపీ కీలక నేత ఒకరు హామీ ఇచ్చినట్లు ప్రచార జరుగుతోంది. డబ్బుతో ప్రలోభపెట్టి కోటంరెడ్డి అనుచరులను రౌడీషీటర్లు తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ వీడియో రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ వీడియోపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందిస్తూ ఒకింత ఉద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
మంత్రి పదవి కంటే న ప్రాణాలే ముఖ్యమని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ వీడియో వైరల్ కావడంతో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు.వీడియోలో ఉన్న అంశం తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, త్వరలోనే పూర్తి విషయం చెబుతామన్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హత్యకు కుట్రకు పన్నిన వ్యవహారంలో పోలీసులు వీడియోలో కనిపించిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. జగదీష్,మహేష్, వినీత్, మల్లిలను ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. వీడియోపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏపీ హోంమంత్రి అనిత కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.