14-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా ప్రస్తుతం మన సమాజంలో మధుమేహం తీరుతెన్నులు, దానివల్ల వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాల గురించి నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఎండోక్రెనాలజిస్ట్ డాక్టర్ బి. శ్రావ్య, కన్సల్టెంట్, కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవాని వివరించారు. ‘కొన్ని దశాబ్దాల క్రితం కనీసం 40 ఏళ్లు దాటిన వారే మధుమేహం బారిన పడినట్లు గుర్తించేవారు. ఇప్పుడు 15 ఏళ్ల వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులు. తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మారుతున్న ఆహారపు అలవా ట్లు.. వీటన్నింటివల్ల అధిక బరువు, ఊబకాయం, దాంతోపాటే మధుమేహం కూడా వస్తున్నాయి. మా ఆస్పత్రికి రోజూ ఔట్‌పేషెంట్ విభాగంలో 20 మంది మధు మేహ బాధితులు వస్తుంటే, వారిలో దాదా పు 30% మంది చిన్నవయసువారే ఉంటున్నారు.
ప్రధానంగా ఇలా చిన్నవయసులో వచ్చేవారిలో ఎక్కువమందికి ఊబకాయం ఉంటోంది. జీవనశైలి మార్పుల వల్ల బరువు పెరిగిపోతున్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా వాసుల్లో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే గర్భంతో ఉన్నప్పుడు కూడా మధ్యమధ్యలో మధుమేహం వచ్చిందేమో పరీక్షించుకోవాలి. గతంలో కేవలం గ్లూకోజ్ నియంత్రిస్తే సరిపోతుంది అనుకునేవారు.
తర్వాత గత పదేళ్ల నుంచి మధుమేహం ఉన్నవారికి కీలక అవయవాలు అంటే గుండె, కిడ్నీలు, కళ్లు, కాళ్లు.. ఇలా అన్నింటినీ కాపాడాలని గుర్తించారు. మధుమేహాన్ని నియంత్రించే మందులతోనే బరువు కూడా తగ్గే అవకాశం ఇప్పుడు ఉంటోంది’ అని తెలిపారు. ‘మధుమేహం వచ్చినవారు తప్పనిసరిగా తమ శరీర బరువును వీలైనంత వరకు అదుపులో పెట్టుకోవాలి.
5- బరువు తగ్గినా కూడా అది మధుమేహ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే నడక లాంటి వ్యాయామాలు ప్రతిరోజూ తప్పక ఉండాలి. దాంతోపాటు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. వీటన్నింటిద్వారా మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపొచ్చు” అన్నారు.