calender_icon.png 13 January, 2026 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాగ్ చేసినందుకే హత్య చేశాడా?

13-01-2026 01:36:47 AM

శోభితా ధూళిపాళ్ల దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోం ది. చివరిసారి ‘మేజర్’ సినిమాతో అలరించిన ఆమె ఇప్పుడు ‘చీకటిలో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో శోభిత ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే, ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ సినిమాలో శోభిత ధూళిపాళ్ల న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా ఉద్యోగం చేసే సంధ్య పాత్రలో కనిపించనుంది. స్నేహితుల హత్యల వెనుక ఉన్న కారణాన్ని కనిపెట్టేందుకు.. యాంకర్ జాబ్ మానేసి, సొంతంగా ఛానల్ పెట్టే యువతి పాత్రలో అలరించనున్నట్టు తెలుస్తోంది. ‘సోషల్ మీడియా పోస్ట్‌లో ట్యాగ్ చేసినందుకే హత్య చేశాడా..’ అంటూ ఆసక్తికరమైన ప్రశ్నతో ముగించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో శోభితతోపాటు విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రను పోషించగా, చైతన్య, విశాలాక్షి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ‘కిరాక్ పార్టీ’, ‘తిమ్మరుసు’ వంటి సినిమాలను తెరకెక్కించిన శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.