calender_icon.png 13 January, 2026 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన శంకరవరప్రసాద్ గారు మెప్పించారా

13-01-2026 01:42:22 AM

చిరంజీవి సినిమా అంటే అంచనాలు ఏర్పడటం సాధారణం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం, ప్రత్యేక పాత్రలో వెంకటేశ్ నటించడంతో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై మొదట్నుంచే అంచనాలు మరో స్థాయిలో ఉన్నాయి. ప్రమోషన్స్‌లోనూ ఆకర్షించిన ఈ సినిమా అనుకూల వాతావరణం మధ్య సోమవారం విడుదలైంది. మరి ‘మన శంకరవరప్రసాద్ గారు’ అందరి అంచనాలనూ ఆయన అందుకున్నారా? దర్శకుడు అనిల్ రావిపూడి గత సంక్రాంతిలాగానే ఈ పండక్కీ హిట్ కొట్టేసినట్టేనా? సినిమా ఎలా ఉంది? సమీక్షిద్దాం.. 

కథ ఏంటంటే.. శంకరవరప్రసాద్ (చిరంజీవి) ఓ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్రమంత్రి శర్మ(శరత్ సక్సేనా) దగ్గర ఆయన డ్యూటీ. శంకర వర ప్రసాద్‌ను ఓ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటాడు మంత్రి శర్మ. ఎప్పుడూ సరదాగా ఉంటూ పైకి ఆనందంగా కనిపించే శంకర ప్రసాద్ మనసులో ఏదో బాధను గ్రహించిన శర్మ.. ఓ సందర్భంలో అందుకు గల కారణం ఏంటని అడుగుతాడు. భార్యతో విడాకులు కావటం.. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఇద్దరు పిల్లలకు దూరంగా ఉండటమేనని కారణమని చెప్తాడు ప్రసాద్. దీంతో ఓ బోర్డింగ్ స్కూల్‌లో చదువుకుంటున్న తన పిల్లల్ని ప్రసాద్ కలుసుకునే ఏర్పాట్లు చేస్తాడు శర్మ. మినిస్టర్ రికమండేషన్‌తో ఆ స్కూల్లో పీఈటీగా చేరిన ప్రసాద్.. తన పిల్లలకు చేరువయ్యే ప్రయత్నాలు ఫలించాయా?

అసలు ప్రసాద్ తన భార్య శశిరేఖ (నయనతార)తో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? చివరకు శంకర వరప్రసాద్ తన భార్యాపిల్లలతో కలిసిపోయాడా.. లేదా? శశిరేఖకు, కర్ణాటక మైనింగ్ వ్యాపారి వెంకీ గౌడ (వెంకటేశ్)కు సంబంధం ఏంటి? అనేదే మిగతా కథ. కొన్ని లాజిక్కులు లేని అంశాలున్నప్పటికీ అవి ప్రేక్షకులను ఇబ్బంది పెట్టినట్టనిపించదు.  ఈ కథ చుట్టూ హాస్యం, భావోద్వేగాలను మేళవించటం ద్వారా వినోదభరితమైన కథగా మలిచాడు దర్శకుడు.

అయితే, అనిల్ రావిపూడి సినిమాల్లో కనిపించే క్రింజ్ కామెడీ ఈ సినిమాలో లేదు. కథపై దృష్టి సారించకుండా హాయిగా నవ్వుకునేలా కామెడీ సన్నివేశాలతో రూపొందించిన సినిమా ఇది. సిట్యువేషనల్ కామెడీ కావడంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ద్వితీయార్ధంలో కొంత సీరియస్ వేలో సాగినా.. చివరి 20 నిమిషాలు వెంకటేశ్ ఎంట్రీతో సినిమా మళ్లీ వినోదంవైపు టర్న్ తీసుకుంది. తెరపై చిరంజీవి, వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయడం.. సగటు ప్రేక్షకుడికి పైసా వసూల్ సినిమా అనే చెప్పాలి. ఇక నయనతారది ఇందులో చిరంజీవికి సమానమైన పాత్ర. నయనతార తనదైన నటనతో ఈ పాత్రకు నిండుదనం తెచ్చిపెట్టింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగానూ ఈ సినిమా బాగుంది.