calender_icon.png 6 August, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్య సాఫల్యతకు ప్రయత్నశీలతయే మూలం

06-08-2025 12:37:53 AM

పాలకుర్తి రామమూర్తి :

* ఒకప్పుడు పల్లెప్రాంతాలలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తూ.. ఉజ్వలంగా వెలిగి, వివిధ దేశాలలో విస్తరించిన ఒకసంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయి, మూసివేయవలసిన పరిస్థితికి చేరింది. దానికి అప్పులిచ్చిన బ్యాంక్, ఆ సంస్థ ఆస్తులను పూర్తిగా అమ్మివేసినా తన సొమ్మును రాబట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంస్థను మూసివేస్తే వివిధ దేశాలలో సంస్థ కార్యక్రమాలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వహిస్తున్న చాలామంది నిష్ణాతులైన, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు రోడ్డునపడే అవకాశం ఉన్నది. 

ప్రజాసుఖే సుఖం రాజ్ఞః 

ప్రజానాం చహితే హితమ్

నాత్మప్రియం హితం రాజ్ఞః 

ప్రజానాం తు ప్రియం హితమ్!

(కౌటిలీయం -1--19)

ప్రజల సుఖంలోనే, హితంలోనే రాజుకు సుఖమున్నది, హితమూ ఉన్నది. తనకు ప్రియమైన దానిని హితమైనదిగా కాక, ప్రజలకు ప్రియమైనదే తనకు హితంగా రాజు భావించాలి. నాయకు డు అనునిత్యమూ ఉద్యమశీలుడై (ప్రయత్నశీలియై) కార్యనిర్వహణ చేయాలి. ప్రయత్నశీలి కానివానికి అనర్థాలు తప్పవు. ప్రయత్నలోపం వల్ల ఇదివరకు లభించినదీ, ఇకముందు లభించాల్సిందీ నశిస్తుంది.

కార్య సాఫల్యతకు ప్రయత్న శీలతయే మూలమైనది అంటాడు ఆచార్య చాణక్య. నాయకుని అభ్యుదయం నేరుగా ప్రజల అభ్యుదయంపై ఆధారపడి ఉంటుంది. ప్రజల సౌభాగ్యమే తన ఉన్నతిగా భావిస్తూ, ప్రజలకు శ్రేయస్సు, సుఖసంతోషాలు అమరే విధంగా నిరంతరం ప్రయత్నిస్తూ, పాలించే నాయకుని పాలనలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. రాజ్యమనేది సంస్థ అనుకుంటే.. ప్రజలను ఉద్యోగులుగా, సరఫరాదారులుగా, వినియోగదారులు గా భావించాలి.

ప్రయత్నమే కార్య సాఫల్యతకు దగ్గరదారి.. వేటాడకపోతే సింహానికి కూడా ఆహారం లభించదు. ప్రయత్నశీలి చిన్న అవకాశం లభించినా దానిని సద్వినియోగం చేసుకుంటాడు. బద్ధకం, వాయిదావేసే తత్వం కలిగిన వారికి ఎన్ని అవకాశాలు అందివచ్చినా అపజయం పాలవుతారు. అలాగని ప్రయత్నం మాత్రమే నాయకులకు విజయాలను ఇస్తుందని చెప్పలేము.

విజయ సాధనలో ప్రయత్నం కీలకమే అయినప్పటికీ, సహజమైన ప్రతిభాపాట వాలు, సరైన శిక్షణ, పటిష్టమైన వ్యూహం, దానిని అమలు చేయగలిగిన దృఢ సంకల్పం.. వీటికి తోడుగా అదృష్టమూ.. ఇలా అనేక అంశాలు కలసివస్తేనే సత్ఫలితాన్ని అందుకుంటారు. పట్టుదల సడలకుండా ప్రత్నించడం వల్ల వ్యక్తుల నైపుణ్యా లు మెరుగవుతాయి.. అది ఓర్పును పెంపొందించుకునేందుకు సహకరిస్తుంది.

ఒక ఉదాహరణ..

ఒకప్పుడు పల్లెప్రాంతాలలో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తూ.. ఉజ్వలంగా వెలిగి, వివిధ దేశాలలో విస్తరించిన ఒకసంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయి, మూసివేయవలసిన పరిస్థితికి చేరింది. దానికి అప్పులిచ్చిన బ్యాంక్, ఆ సంస్థ ఆస్తులను పూర్తిగా అమ్మివేసినా తన సొమ్మును రాబట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంస్థను మూసివేస్తే వివిధ దేశాలలో సంస్థ కార్యక్రమాలను నిబద్ధతతో, అంకితభావంతో నిర్వహిస్తున్న చాలామంది నిష్ణాతులైన, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు రోడ్డునపడే అవకాశం ఉన్నది.

ఇలాం టి సామాజిక, అర్థిక సమస్యలను అధిగమించేందుకు ఆ బ్యాంక్ సంబంధిత రంగంలోని నిపుణు డినొకరిని నియమించి, పరిస్థితిని ఆధ్యయనం చేసి నివేదికను సమర్పించవలసిందిగా కోరింది. నిపుణుడు ఆ సంస్థ ముఖ్య కార్యాలయాన్ని సం దర్శించి, వివిధ ప్రాంతాలలోని ఉద్యోగులతో మాట్లాడి అక్కడి వాస్తవ పరిస్థితిని ఆధ్యయనం చేశాడు. ఊహించిన దానికన్నా అధమస్థితిలో ఉన్న సంస్థ ఒకప్పుడు సంబంధిత రంగంలో, ప్రపంచంలోనే నాణ్యమైన ఉత్పత్తులతో విక్రయానంతర సేవలతో అగ్రభాగాన నిలిచినదే.

ప్రపం చవ్యాప్తంగా సుశిక్షితులైన, నిష్ణాతులైన ఉద్యోగులను కలిగియున్నా, ఉత్పత్తులను ఆధునీకరిం చుకునే ఆర్థిక సామర్థ్యం, దార్శనికత కొరవడిన కారణంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులలో, వారి ఉత్పత్తులు వెనుకబడిపోయాయి. వినియోగదారుల కన్నా ఉద్యోగులే అధికంగా ఉండడం.. వారి జీతభత్యాలకు మరియు అవసరమైన శిక్షణలనందించడానికి భారీమొత్తంలో చెల్లించాల్సి రావడం సంస్థకు మోయలేని భారంగా మారింది.

ఉదాహరణగా ఒక పట్టణంలో పన్నెండు మందికి విడి భాగాలను అందించడం, విక్రయానంతర సేవలందించేందుకు ఇరువది ఎనిమిది మంది ఉద్యోగులు ఉండడం గుర్తించాడతడు. ఇలా లోనికి వెళ్లినా కొద్దీ సవరించడానికి అలవికాని లొసగులు చాలా కనిపించాయి.

ఉద్యోగుల నైపుణ్యాలపై నమ్మకం..

ఒకవైపు సంస్థ పనితీరు అత్యంత నిరాశాజనకంగా ఉన్నా.. ఉద్యోగుల నైపుణ్యాలు, సేవాభా వన, ఉత్సాహం, నిబద్ధత అతనిని ఆకర్షించాయి. అతనిలో సందిగ్ధత నెలకొన్నది.. ప్రస్తుత పరిస్థితిలో సంస్థ పునర్నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడానికి బ్యాంకులు సమ్మతించవు.. మునిగిపోతున్న నావను రక్షించమని బ్యాంకును కోరడం సమంజసమూ కాదు. అలాగని సంస్థను మూసివేస్తే వందలమంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడతాయి.

ఉద్యోగులు ఉపాధిని కోల్పోకుండా చూడడం సామాజిక బాధ్యత.. బాగా ఆలోచించి ప్రభావవం తమైన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నిపుణుడిపై ఉన్నది. అందుకే భావోద్వేగపరమైన మానసిక స్థితిలో, తన సమర్థతపైన తనకున్న విశ్వాసంతో, ఉద్యోగుల నైపుణ్యాలపై నమ్మకంతో.. సంస్థ ఉనికిని నిలిపేందుకా సంస్థను కొనుగోలు చేయాలనే సాహసోపేత నిర్ణయాన్ని తీనుకున్నాడు.

తదుపరి బ్యాంక్ యాజమాన్యాన్ని సంప్రదించి.. ‘సంస్థ ఆర్థిక పరిస్థితిని, ఉద్యోగుల పట్ల సామాజిక బాధ్యతను.. పూర్తిగా వివరించి, దానిని తాను కొనుగోలు చేయాలంటే ఎంత చెల్లించాల్సి ఉంటుందని’ నేరుగా అడిగాడు. ఆ నిర్ణయాన్ని బ్యాంకు వారు అతని పిచ్చితనంగా భావించి వారించినా.. పట్టించుకోకుండా.. ఉద్యోగుల సమర్థత, నిబద్ధత తప్ప.. వ్యాపార లావాదేవీలు గానీ, అవసరమైన ‘వర్కింగ్ క్యాపిటల్’ గానీ, నికరమైన ఆస్తులు గానీ ఏమీలేని, దివాలా తీసిన సంస్థను యాజమాన్యం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేశాడు.

తదుపరి కాలంలో ఆ సంస్థ అత్యంత ప్రభావవంతమైన సంస్థలలో అగ్రగామిగా నిలిచింది. వివిధ దేశాలలో తన సేవా కార్యక్రమాలను విస్తరించి వందలమంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పించింది. దానికి నాయకుని ఆత్మవిశ్వాసం, ఉద్యోగుల ప్రతిభాపాటవాలపై నమ్మకం, విస్తృత పరిధిలో ఆలోచనలు చేస్తూ ఎదురవుతున్న సమస్య లను పరిష్కరించుకునే నైపుణ్యం, ఫలితాలు ఆవిష్కృతమయ్యే వరకూ నిరీక్షించగలిగిన ఓర్పూ, సహనం, అందరినీ సమన్వయ పరచగలిగిన నాయకత్వ పటిమ, దీక్షాదక్షతలు, నిరంతర ప్రయత్నశీలతలే కారణం.

వ్యాపారానికి ఆర్థిక ప్రగతియే లక్ష్యం. దానికి సామాజిక బాధ్యత, ఉద్యోగుల పట్ల ప్రేమానురాగాలు, భావనలో విస్తృతి, నిరంతర ప్రయత్నశీలత కలిగిన నాయకుల సారథ్యంలో అదెలాంటి తుఫానులనైనా తట్టుకొని, బహుముఖ ప్రయోజనాలనూ నెరవేరుస్తూ ముందుకు సాగగలుగుతుంది.