08-01-2026 12:20:35 AM
టేకులపల్లి, జనవరి 7, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం ముత్యాలంపాడు X రోడ్డు రైతు వేదికలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి, భారం కాకుండా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా తల్లి తండ్రులకు ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.
మండలంలోని 82 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 15 మంది లబ్దిదారులకు రూ.4.50 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇది పేదలకు, ప్రకృతి వైపరీత్యాలు లేదా తీవ్రమైన వ్యాధుల బారిన పడినవారికి ఆర్థిక సహాయం అందించే ఒక నిధి, దీని కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, వికలాంగులు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సహాయాన్ని అందిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పేద ప్రజలను ఆదుకుంటూ గ్రామాల్లో అభివృద్ది పనులను చేపడుతున్నామన్నారు. గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలో 138 స్థానాలకు గాను 101 అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు.
రానున్న రోజుల్లో మరింత గ్రామాలను అభివృద్ధి చేసుకునే విధంగా నూతన సర్పంచులు అందరూ పనిచేస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. కార్యక్రమంలో తహసీల్దార్ వీరభద్రం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.