25-11-2025 12:52:22 AM
మహబూబాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కొందరు ప్రభుత్వ పథకాలన్నీ తామే ఇస్తున్నట్లు అప్పుడే ప్రచారానికి తెర లేపారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లిలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మిట్టపల్లి నాగార్జున ప్రభుత్వం కొత్తగా లబ్ధిదారులకు మంజూరు చేసిన రేషన్ కార్డులకు బదులు ఏకంగా తన ఫొటో, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఫొటోలతో రేషన్ కార్డులు ముద్రించి ప్రత్యేకంగా లామినేషన్ చేయించి పంపిణీ చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొత్తగా లబ్ధిదారులకు మంజూరైన రేషన్ కార్డులను అధికారుల సమక్షంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందించాల్సి ఉండగా అందుకు భిన్నంగా, పార్టీ అధ్యక్షుడు సొంతంగా కార్డులను ముద్రించి పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం సామాజిక మాధ్య మాల్లో వైరల్ కావడంతో వివాదాస్పదంగా మారింది. సొంతంగా రేషన్ కార్డులను ముద్రించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.