calender_icon.png 25 November, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు

25-11-2025 12:50:13 AM

ప్రజలకు 75 లక్షలకు టోపీ

నిజామాబాద్, నవంబర్ 24 (విజయ క్రాంతి): లక్కీ జనరల్ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతు అమాయక ప్రజల నుండి డబ్బులు కట్టించుకొని చేతులెత్తేసి ఆర్థిక నేరానికి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం సీపీ సాయిచైతన్య  వివరాలు వెల్లడించారు. ఎల్జీ ఇండియా పేరుతో ఉన్న యాప్‌లో పెట్టుబడి పెట్టి మోసపోయానని రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

నగరంలోని ముబారక్‌నగర్‌కు చెందిన మేకల జగదీష్, సాటాపూర్‌నకు చెందిన పెద్ద భూమయ్య అలియాస్ ప్రేంను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్వారా ఎల్జీ ఇండియా యాప్ కు సంబంధించిన వివరాలు సేకరించారు. మేకల జగదీష్, ప్రేం అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఎల్జీ ఇండియా యాప్‌లో రూ.25,500 డిపాజిట్ చేసి రోజుకు 16 వీడియోలను క్లిక్ చేస్తే వీడియోకు రూ.55 చొప్పున లాభం వస్తుందని పలువురిని నమ్మించారు. దీంట్లో భాగంగా ఇతరులను ఈ యాప్‌లో జాయిన్ చేస్తే 8 మందికి గాను రూ.4వేలు, 15మంది దాటితే రూ.8వేలు వస్తాయని పేర్కొన్నారు.

దీనిని నమ్మిన రెంజల్ మండలం సాటాపూర్‌నకు చెందిన పిట్ల మధు యాప్‌లో రూ.25,500 డిపాజిట్ చేశాడు. అనంతరం లాభాలు వచ్చినప్పటికీ డబ్బు అంతా వ్యాలెట్‌లో ఉండిపోతోంది. చివరకు నిర్వాహకులను నిలదీయగా ముంబయిలో తమ కంపెనీ మేనేజర్ రాజు ఉంటాడని ఆయనకు చెప్పి సమస్య పరిష్కరిస్తామని నమ్మబలికారు. కానీ డబ్బులు రాకపోగా తన బ్యాంక్ అకౌంట్ సైతం ఫ్రీజ్ కావడంతో వెంటనే స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

నిందితులు ఇదేవిధంగా సాటాపూర్ గ్రామానికి చెందిన 150మందని సైతం మోసం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఎల్జీ కంపెనీ యాప్‌లో ఇప్పటివరకు రూ.75 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ యాప్ పనిచేయదంలేదని దని ఎస్పీ తెలిపారు. ప్రజలు ఇలాంటి యాప్‌లలో డబ్బులు పెడితే అదనపు ఆదాయం వస్తుందని గుడ్డిగా నమ్మవద్దని సూచించారు.