23-07-2025 11:04:17 PM
చివ్వేంల: బుధవారం చివ్వేంల మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల, పి హెచ్ సి, తహసీల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ చేతుల మీదుగా మొక్క నాటారు. పదవ తరగతి విద్యార్థులకి గణితం సబ్జెక్ట్ ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బోధించారు. విద్యార్థులని పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులచే బోర్డుపై లెక్కలు వేసి చేపించారు.
విద్యార్థుల కొరకు కుర్చీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాస్టల్ లో డ్రైనేజి, త్రాగునీరు సమస్య ఉందని తెలపగా వెంటనే పరిష్కరించాలని అలాగే ఇంకుడు గుంట నిర్మించాలని ఎంపిడిఓకి సూచించారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్ రావు, ఎంపిడిఓ సంతోష్,హెడ్ మాస్టర్ లింగయ్య, హాస్టల్ వార్డెన్ కవిత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.