calender_icon.png 16 August, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా గాంధీ విద్యాలయం, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

24-07-2025 06:28:07 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల, గారేపల్లిలోని సహకార పరపతి సంఘం, ఎరువులు దుకాణం, జీవన జ్యోతి మండల సమాఖ్య, మహిళా శక్తి కుట్టు కేంద్రం, చిల్డ్రన్స్ పార్కు, లక్ష్మి గణపతి, శ్రీ రాజ రాజేశ్వరి ఎరువుల, విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో 9వ తరగతి గది, వంటశాల, ఆహారం నాణ్యత,  స్టోర్ రూము, కూరగాయలు నిల్వలు, హాజరు పట్టిక, ఆహారం నాణ్యతపై విద్యార్థులు వ్రాసిన ఫీడ్ బ్యాక్, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందించాలని స్పష్టం చేశారు. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులను వినియోగించాలని, నాణ్యత, లేని  సరుకులు వాపసు చేయాలని ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కూరగాయలు ఓపెన్ గా ఉంచకుండా కప్పి ఉంచాలని సూచించారు.  విద్యార్థుల పఠనా సామర్థ్యం, ఆరోగ్యం పట్ల  ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

తరగతి గదిలో విద్యార్థులను ఏ సబ్జెక్టు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. లెక్కలు పీరియడ్ జరుగుతుందని విద్యార్థులు తెలుపగా లెక్కలతో పాటు అన్ని సబ్జెక్ట్ లలో ముందంజలో ఉండాలని సూచించారు.  విద్యార్థుల కు ప్రత్యేక తరగతులు నిర్వహించి ముందంజలో ఉండేలా ప్రోత్సహించాలని అన్నారు.గారేపల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణం, లక్ష్మి గణపతి, శ్రీ రాజ రాజేశ్వరి ఎరువుల, విత్తన దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని రైతులు అపోహలు పడొద్దని సూచించారు. ధరలు పట్టిక పరిశీలించారు.  ఆధార్ నమోదు చేయాలని, విధిగా కొనుగోలు చేసిన వారికి రసీదులు ఇవ్వాలని ఆదేశించారు.

ఎరువులు, విత్తనాలు కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్ కు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  రద్దీ ఉంటే స్లిప్పులు జారీ చేసి క్రమపద్ధతిలో ఎరువులు ఇవ్వాలని, ఎక్కువ సేపు రైతులు నిరీక్షించకుండా ఉండేలా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. పాస్ బుక్ లేని రైతులకు ఆదార్ కార్డు నమోదు ద్వారా ఎరువులు ఇవ్వాలని సూచించారు.జీవన జ్యోతి మండల సమాఖ్య మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని పరిశీలించి మహిళలతో మాట్లాడారు రోజుకు ఎన్ని జతలు. కుడుతున్నారని, నెలకు ఎంత ఆదాయం వస్తుందని అడిగి తెలుసుకున్నారు.  బట్టలు కుట్టుటలో మహిళలకు మెళకువలు నేర్పేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని డిఆర్డీఓకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల యూనిఫామ్స్ తో పాటు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిరంతరం కుట్టు పనులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.చిల్డ్రన్స్ పార్క్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు అందుబాటులో ఉంచాలని సూచించారు.  ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చిన్నారుల పార్కును ప్రారభించి ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో బ్లాక్ ప్లాంటేషన్ చేపెట్టేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమాలలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, వ్యవసాయ అధికారి బాబు, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ నాగరాజు ఎంపిడిఓ బాబు, వ్యవసాయ శాఖ ఈడీఏ శ్రీపాల్, ఎంపీవో వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.