23-07-2025 07:39:20 PM
పలు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలు ఆరా తీసిన కలెక్టర్..
హనుమకొండ: హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపు సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ) పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీకి సంబంధించిన పళ్ళు రికార్డులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యాలయానికి నిత్యావసర సరకుల సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, ఇతర నిత్యావసర సరకులను తాజాగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేశారు. విద్యార్థినులకు తయారు చేసిన భోజన పదార్థాలను కలెక్టర్ పరిశీలించారు.
డైనింగ్ హాలులో పాఠశాల విద్యార్థినులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థినుల కోసం వండిన భోజనం బాగుందని మెచ్చుకున్నారు. అనంతరం విద్యాలయంలో ఆటలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ మెటీరియల్ ఉందా అని, ఆటలు ఆడుతున్నారా అని కలెక్టర్ విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ రికార్డ్స్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి డి. వాసంతి, పాఠశాల ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.