08-05-2025 01:32:20 AM
భగ్గుమన్న గ్రూపు విభేదాలు.. జువ్వాడి వర్సెస్ కల్వకుంట్ల
ఇరువర్గాలను శాంత పరిచిన అడ్లూరి
జగిత్యాల, మే 7 (విజయక్రాంతి) : అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత వర్గ విభేదాలు మళ్లీ గుప్పుమన్నాయి. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన డిసిసి సమావేశంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చువాడి నర్సింగరావు వర్గానికి, అదే నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు కల్వకుంట్ల సుజిత్’రావు వర్గానికి మధ్య తోపులాట జరిగింది.
జిల్లా కేంద్రంలోని ఏబి కన్వెన్షన్ హాల్లో బుధవారం జిల్లాస్థాయి కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సమావేశానికి సారధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు అంజన్ కుమార్, కత్తి వెంకటస్వామిల సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మీతో ఫాటూ పార్టీ జిల్లా ఎస్సీ, బీసీ, కిసాన్, యూత్ తదితర విభాగాల అధ్యక్షులు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా మార్కెట్ కమిటీ చైర్మన్ లను సైతం వేదిక పైకి ఆహ్వానించే క్రమంలో మెట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ పేరు చెప్పగానే ఒక్కసారిగా జువ్వాడి వర్గానికి చెందిన పలువురు నాయకులు గొడవకు దిగారు. టిఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో కల్వకుంట్ల వర్గానికి చెందిన మరికొందరు నాయకులు వేదిక ముందుకు వచ్చి వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు సమావేశంలో గందరగోళం నెలకొని రసాభాసగా మారింది.
డిసిసి అధ్యక్షులు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ వేదిక దిగి వచ్చి ఇరు వర్గాలను శాంతింప చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. ఓ సందర్భంలో చేతులు జోడించి నమస్కరించి ఓపిక పట్టండి, గొడవ చేయకండి అని అడ్లూరి బతిమాలి శాంతింప చేశారు. అనంతరం అడ్లూరి, జీవన్ రెడ్డి తదితర ప్రముఖులు ప్రసంగిస్తూ రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీలు, పలు అభివృద్ధి పనులను వివరించారు.
గతంలో టిఆర్‌ఎస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారన్నారు. పార్టీలో చిరకాలంగా క్రమశిక్షణతో పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని అవకాశాలు వచ్చేదాకా అందరూ ఓపికతో ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లాలోని పలు మండలాల, పట్టణాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, స్థాయి నాయకులు పాల్గొన్నారు.