calender_icon.png 19 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

19-11-2025 12:56:44 AM

సౌదీ ప్రమాద బాధిత కుటుంబాలకు మంత్రి అజారుద్దీన్ భరోసా

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అజారుద్దీన్ భరోసా ఇచ్చారు. కార్వాన్ నియోజకవర్గం టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని జిర్రా నటరాజ్‌నగర్‌లో పక్కపక్క ఇళ్లలో నివసించే రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.

వృత్తిరీత్యా కార్పెంటర్ అయిన అబ్దుల్ ఖదీర్, తన భార్య గౌసియాబేగం, మామ మహ్మద్ మౌలానాలతో కలిసి ఉమ్రా యాత్రకు వెళ్లారు. ప్రమాదంలో ఈ ముగ్గురూ దుర్మరణం చెందారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న ఖదీర్ కుమారుడు అబ్దుల్ షోయబ్ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. వీరి ఇంటిపక్కనే నివసించే మహ్మద్ అలీ, అతని భార్య షాహెనాజ్‌బేగం సైతం ఇదే ప్రమాదంలో మరణించడంతో నటరాజ్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

బాధిత కుటుంబాలను మంత్రి అజారుద్దీన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మంగళవారం పరామర్శించి, ప్రభుత్వ అండ ఉంటుందని భరోసా ఇచ్చారు. అబ్దుల్ ఖదీర్ పెద్ద కుమారుడు సమీర్, అతడి భార్య ఆయేషా తబుస్సుం కూడా ఇదే బృందంతో కలిసి సౌదీకి వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషంలో వారికి టికెట్లు ఖరారు కాకపోవడంతో, వారి ప్రయాణం ఈ నెల 13కు వాయిదా పడింది. ప్రస్తుతం వారు అక్కడే క్షేమంగా ఉన్నట్లు సమాచారం.