19-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): స్కానింగ్ సెంటర్ల నిర్వహకులు చట్టాలకు లోబడి గర్భిణీలకు పరీక్షలు నిర్వహించాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని, పుట్టబోయే బిడ్డ ఆడో మగో తెలియజేయాలని ఎవరైనా కోరితే వారి వివరాలను తెలియజేయాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్ కోరారు. లింగ నిర్ధారణ, బాలికల పట్ల వివక్షత, ఎంటిపీ చట్టం, తదితర అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పరీక్షల నిమిత్తం లింగ నిర్ధారణ కోసం అబార్షన్ల కోసం అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని సూచించారు. ఎంటిపీ చట్టం ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో అర్హులైన వారికి అబార్షన్ చేయడానికి గుర్తింపు పొందిన ఆసుపత్రిలో అవకాశం కల్పించిందన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ శశి జోష్ణ, అడ్వైజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ జగదీశ్వర్, రాజేంద్రప్రసాద్, ప్రోగ్రాం అధికారికి డాక్టర్ సారంగం, చైల్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ శ్రావణ్, డిపిఆర్‌ఓ రాజేంద్రప్రసాద్, మాస్ మీడియా అధికారి ప్రసాద్, సిడిపిఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.