06-08-2025 12:10:17 AM
గద్వాల, ఆగస్టు 05 ( విజయక్రాంతి ) : విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారాన్ని సమయానికి అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరతకు గురవుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో,జిల్లా కలెక్టర్ మంగళవారం స్వయంగా వసతిగృహాన్ని సందర్శించి విద్యార్థులు,ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.
వారు ఎదుర్కొంటున్న సమస్యలను విని, తక్షణ చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమం విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు.
విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలనీ, వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సూచించారు. వసతిగృహ వార్డ్పె విచారణ జరిపి పూర్తి నివేదికను అందజేయాల్సిందిగా జిల్లా బీసీ సంక్షేమ అధికారికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి నిశిత, వార్డెన్ రజిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.