10-01-2026 12:06:26 AM
పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి
కమాన్ పూర్, జనవరి 9(విజయ క్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి సూచించారు. గురువారం రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వలన కలుగు అనర్ధాల పై అవగాహన లో భాగంగా - సే నో డ్రగ్* అనే నినాదం తో శుక్రవారం కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గంజాయి మత్తుపదార్థాల నియంత్రణ, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ పై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ముఖ్యఅతిథిగా హాజ రై ప్రజలతో విద్యార్థులతో మాట్లాడుతూ...విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్ధాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకుని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని వీటి వినియోగం వలన తమ జీవితాలను అంధకారం చేసుకోవడంతో పాటు, ఆరోగ్య, ఆర్థికపరంగా చాలా నష్టపోతారని, ముఖ్యంగా మీ కోసం జీవించే తల్లిదండ్రుల సంతోషాన్ని దూరం చేస్తారని, మీ గ్రామాలలో, మీ చుట్టూ ప్రక్కల ప్రాంతం లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న తక్షణమే స్థానిక పోలీసులకు, నార్కోటిక్ విభాగం 1908 నంబర్ కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యం వుంచబడుతుందని డిసీపీ తెలిపారు.
సైబర్ నేరాలపై డిసీపీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో నేర గాళ్ళు టెక్నాలజీ వినియోగించుకొని నేరాలకు పాల్పడుతున్నా రని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి మీ సెల్ ఫోన్లకు, ఈమెయిల్ కు వచ్చే సందేశాల పట్ల అప్రమత్తం వుండాలని. తెలియని వెబ్ సైట్లలో మీ వ్యక్తిగత సమాచారం, ఫోటోలను పోస్ట్ చేయవద్దని, ప్రధానం గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్ లైన్ ద్వారా ఎలాంటి లావాదేవీలు జరపవద్దని, అలాగే పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాబృందం సభ్యులు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మూఢనమ్మకాలు, గంజాయి వంటి మత్తుపదార్థాల వలన కలుగు అనర్ధాలపై పాటల రూపంలో నాటకాల రూపంలో స్క్రిట్ చేసి ప్రజలలో అవగాహన చైతన్యం కల్పించారు.
గోదావరిఖని టూ టౌన్ సీఐ నక్క ప్రసాదరావు స్థానిక సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కాశీమల్ల సుధాకర్, మాజీ సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు, ఎస్‌ఐ కొట్టే ప్రసాద్, బంజారా ప్రవచనకర్త ఎస్ పి. నాయక్ ఏఎస్‌ఐ బాలాజీ నాయక్, సిబ్బంది జంగిలి రమేష్ , దాసి సతీష్, శ్రీనివాస్, ఎండి పసియోద్దీన్ మండలం ప్రజలు, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.