23-12-2025 12:08:06 AM
ముకరంపుర, డిసెంబరు 22 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించా లని, వారి సహనాన్ని పరీక్షించవద్దని రాష్ట్ర జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాకు వచ్చిన మారం జగదీశ్వర్‌కు జిల్లా జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలసి, డీఏలు, పీఆర్సీ, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లులు, సిపిఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ తదితర పెండింగ్ సమస్యలపై వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల కోసం ప్రభుత్వం ద్వారా 4 వేల కోట్లను ఇప్పించామని, త్వరలోనే మరో 700 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సరెండర్ లీవ్ చెల్లింపులకూ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల పెండింగ్ బిల్లులు నెలకు సగటున 700 కోట్లు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని నియంత్రించేందుకు నెలకు కనీసం 1,500 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.
ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కన్వీనర్, పీజీవోల జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగి శ్రీనివాస్, కార్యదర్శి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోట రామస్వామి, పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు కరుణాకర్ రెడ్డి, జయపాల్ రెడ్డి, గోనె శ్రీనివాస్, విజయేందర్ రెడ్డి, శ్యాం కుమార్, విద్యాసాగర్, దివాకర్, తదితరలు పాల్గొన్నారు.