calender_icon.png 23 December, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29 నుంచి అసెంబ్లీ

23-12-2025 01:31:36 AM

  1. సాగుజలాలే ప్రధాన అజెండా 
  2. పదేళ్ల బీఆర్‌ఎస్ వైఫల్యాలను చాటిచెబుదాం 
  3. అసెంబ్లీ వేదికగా ఎండగడదాం 
  4. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపు 
  5. కమాండ్ కంట్రోల్‌లో మంత్రులతో సుదీర్ఘ చర్చ

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ‘అసెంబ్లీ సమావేశాలు ఈనెల 29 నుంచి మొదలు కానున్నాయి. సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాల అంశమే ప్రధాన అజెండా కావాలి. అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అన్యాయాన్ని ఎండగడదాం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సాగు జలాల విషయంలో తెలంగాణ కోల్పోయిన హక్కులను ప్రజలకు తెలియజేద్దాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అవసరమైతే సభలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తుపోతల ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ఆయన మంత్రులతో సమావేశమయ్యారు. ఇటీవలి సర్పం చ్ ఎన్నికలు, వచ్చే ప్రాదేశిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, పీఏసీఎస్ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

దాదాపు మూడున్నర గంటల పాటు అనేక అంశాలపై చర్చ సాగింది. తెలంగాణ అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునే కార్యాచరణపై సీఎం చర్చించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్లే కృష్ణా నీటి వాటాలో అన్యాయం జరిగిందని, ఇదే విషయాన్ని సభ వేదికగా ప్రజలకు పూర్తిగా వివరించాలనే నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు మంచి ఫలితాలనే ఇచ్చాయని, కొన్ని పొరపాట్లు వల్ల స్థానాలు తగ్గాయని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది.

వచ్చే ప్రాదేశిక ఎన్నికల్లో ఆ పొరపాట్లకు తావు లేకుండా చూసేందుకు ఎత్తుగడలు రూపొందించేందుకు సిద్ధమయ్యారని సమాచారం. పంచాయతీ ఫలితాలపై మంత్రులకు ర్యాంకులు ఇచ్చినట్లుగా తెలిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులదే బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. మండల పరిషత్‌లతో పాట్లు జడ్పీ పీఠాలను క్లీన్ స్వీప్ చేయాలని సీఎం పిలుపునిచ్చినట్లు సమాచారం.

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీల విలీనం.. డివిజన్ల ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయాలు, నిబంధనలు మంత్రులకు సీఎం వివరించారు. కేంద్రం వద్ద పెండింగ్ నిధుల అంశంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రానికి రావాల్సిన వాటిపై శాఖల వారిగా ఆయా మంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు.