23-12-2025 01:28:56 AM
భారీగా అధ్యాపక పోస్టుల ఖాళీలు
4,520 పోస్టులకు 1,695 మందే..
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల పరిస్థితి దారుణంగా తయారైంది. సరిపడ బోధనా సిబ్బంది లేక సర్కారు కాలేజీల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఉన్నత విద్యను ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖాళీ అవుతున్న పోస్టులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో డిగ్రీ కాలేజీల్లో బోధించే అధ్యాపకుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతోంది.
రెగ్యులర్ అధ్యాపకులను నియ మించకుండా వారి స్థానంలో గెస్ట్, కాంట్రాక్ట్ అధ్యాపకులను నియమించుకొని నెట్టుకొస్తున్నారు. కాలేజీల్లో సరి పడా సిబ్బంది లేకపోవడంతో తమ పిల్లలను ఆ కాలేజీల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు పెద్దగా సుముఖత చూపించడంలేదు.
కీలక పోస్టులూ ఖాళీనే..
డిగ్రీ కాలేజీల్లోని కీలక పోస్టులైన ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 149 డిగ్రీ కాలేజీలుంటే, వీటిలో 4,520 పోస్టులకు పనిచేస్తున్నది మాత్రం కేవలం 1,695 మందే. 2,825 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇందులోనూ 2,570 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. ఈ 2,570 పోస్టుల్లో 50 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మరో 50 శాతం జూనియర్ లెక్చరర్లను ప్రమోషన్ల ద్వారా భర్తీచేస్తారు. అంతేకాకుండా 145 ప్రిన్సిపాల్ పోస్టులకు గానూ ప్రస్తుతం పని చేస్తున్నది కేవలం 84 మందే.
మిగతా పోస్టులు ఖాళీనే. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 133 ఉంటే కేవలం 23 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులను ఆటలు ఆడించే పరిస్థితే లేదు. లైబ్రేరియన్ పోస్టులు 133 ఉంటే, ఏకంగా 90 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పనిచేస్తున్నది 43 మంది మాత్రమే. ఇలా ప్రధాన పోస్టుల్లో సిబ్బంది లేక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కునారిళ్లుతున్నాయి. ఉన్నవారినే ఇన్‌చార్జిలుగా పెట్టి కళాశాలలను నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది.
అడ్మిషన్లు అంతంతే..
సరిపడ అధ్యాపకులు కాలేజీల్లో లేకపోవడంతో అడ్మిషన్లు తీసుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇష్టపడంలేదు. పేరున్న మంచి కాలేజీల్లో సీట్లు నిండితున్నా మిగతా కాలేజీల్లో అయితే నిండడం కష్టంగానే మారింది. ఈ ఏడాది కాలేజీల్లో సీట్లు అంతంత మాత్రంగానే నిండాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 90 వేల సీట్లుంటే 51 వేల అడ్మిషన్లు మాత్రమే నిండాయి.
సిబ్బంది కొరత, సరైన వసతుల్లేకపోవడంతో ఇంటర్ తర్వాత చాలా మంది విద్యార్థులు ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనే చేరుతున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో దాదాపు 1.22 లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేట్ వైపు విద్యార్థులు మళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వం అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతోపాటు కాలేజీల్లో ల్యాబ్‌లు, ఇతర వసతులను కల్పించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.