calender_icon.png 23 December, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రిడిటేషన్ కార్డులపై జీవో జారీ

23-12-2025 01:25:37 AM

సమాచారం సేకరించే జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు వేర్వేరుగా కార్డులు 

2016 నాటి నిబంధనలు రద్దు 

హైదరాబాద్, డిసెంబర్  22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని  జర్నలిస్టులకు అక్రిడిటే షన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ ప్ర భుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 2016 నాటి పాతన నిబంధనలను రద్దు చేస్తూ ‘ తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ -2025’ను ఖరారు చేస్తూ జీవో 252ను సీఎస్ రామకృష్ణారావు సోమవారం జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర స్థా యి (ఎస్‌ఎంఏసీ), జిల్లా స్థాయి (డీఎంఏసీ) అక్రిడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు.

కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాత కార్డులే కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు జర్నలిస్టులకు గుర్తింపుగా అక్రిడిటేషన్ కార్డు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు ఇవ్వనున్నారు. డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చే మీడియా కార్డులు కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు మాత్రమే పనికొస్తాయని పేర్కొన్నారు. 

డిజిటల్ మీడియాకు నిబంధనలు

డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రిడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్‌సైట్‌కు గత ఆరు నెలల్లో కనీసం 5 లక్షల మంది వ్యూవర్స్ ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరిలో గరిష్టంగా 10 కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

రంగాల వారిగా అర్హతలు

* న్యూస్ పేపర్లు: కనీసం 2 వేల ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రడిటేషన్ కార్డులకు అర్హులు. వీరికి పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. 

* ఎలక్ట్రానిక్ మీడియా: శాటిలైట్ ఛానళ్లు 50 శాతం వార్తా కంటెంట్ కలిగి ఉండాలి. లోకల్ కేబుల్ ఛానళ్లు రోజుకు కనీసం 3 బులిటెన్లు టెలికాస్టు కావాలి. 

* జర్నలిస్టు అర్హత: రాష్ట్ర స్థాయిలో అక్రిడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్హత లేదా ఐదేళ్లు మీడియాలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

* నియోజకవర్గం, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి.

* ఫ్రీలాన్స్ అండ్ వెటరన్ జర్నలిస్టులు: 15 ఏళ్ల అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ల అనుభవంతో పాటు 58 ఏళ్లు నిండి న వెటరన్ జర్నలిస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

నిబంధనలు ఉల్లంఘన జరిగితే..

అక్రిడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 

కమిటీ నిర్మాణం

* రాష్ట్ర కమిటీ (ఎస్‌ఎంఏసీ) చైర్మన్‌గా మీ డియా అకాడమీ చైర్మన్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ కో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో వివిధ జర్నలిస్టు యూ నియన్ల ప్రతినిధులు, పీసీఐ సభ్యులు ఉంటారు. 

* జిల్లా కమిటీ (డీఎంఏసీ) జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీపీఆర్వో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 

చిన్న పత్రికల మనుగడకు కష్టం

ప్రభుత్వం తెచ్చిన జీవో జర్నలిస్టులకు అన్యాయం చేసేదిగా ఉన్నది. జీవో అతిగతి లేదు. తెలంగాణలోని ఎంతో మంది జర్నలిస్టులు నష్టపోయే అవకాశం ఉంది. చిన్న, మధ్యతరగతి పత్రికలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం రెండేళ్ల నుంచి కార్డులకు స్టిక్కర్లేసుకుంటూ కొనసాగించి చివరికి జర్నలిస్టులను ఆగమ్యగోచారంలోకి  నెట్టి వేసే జీవో జారీ చేసింది. ఈ జీవోతో ఎంతోమంది జర్నలిస్టులు రోడ్డున పడాల్సి వస్తుంది. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

 మామిడి సోమయ్య, రాష్ట్ర కన్వీనర్,

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 

కొత్త జీవోతో సరికొత్త సవాళ్లు

కొత్త జీఓ సరికొత్త సవాళ్లను తీసుకొచ్చింది. జర్నలిస్టుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. స్థానిక పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. బిగ్, మీడియం, స్మాల్ న్యూస్ పేపర్ల కేటగిరిల విభజనపై స్పష్టత లేదు. రాష్ట్రంలోని ప్రధాన పత్రికలు చాలా వరకు కూడా చిన్న పత్రికల విభాగంలో చేరిపోయే ప్రమాదం ఉంది. డిజిటిల్ మీడియాను గుర్తించడం సంతోషకరమే అయినా... యూనిక్ వ్యూస్ ఎలా నిర్దారిస్తారు..? దశాబ్దాలుగా జర్నలిస్టులుగా కొనసాగిన వారు స్వయంగా డిజిటల్ మీడియాలను నిర్వహిస్తున్నప్పటికీ వ్యూస్ కొలమానంగా చేర్చడం వారికి అశనిపాతంగా మారింది.

రాష్ట్రంలో ఒక్కో డిజిటల్ మీడియాకు కేవలం 10 అక్రిడేషన్ కార్డులతో సరిపెట్టకుండా కొత్త జిల్లాల వారిగా కెటాయిస్తే బావుండేది. పౌరసంబంధాల శాఖ జాబితాలో ఉన్న పత్రికలు రోజు వారిగా ఎంత ప్రింట్ అవుతున్నాయి? తప్పుడు లెక్కలు చూపిస్తున్న పత్రికల వివరాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ఎంప్యానెల్ మెంట్ అమలు  చేసే విధానం మరుగునపడిపోయింది. ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేయాల్సి ఉన్నప్పటికీ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఎంప్యానెల్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న స్థానిక పత్రికలు అక్రిడేషన్లు పొందే అవకాశం లేకుండా పోయింది. 

 శివనాద్రి ప్రమోద్‌కుమార్,

డబ్ల్యూజేఐ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ