14-10-2025 12:00:00 AM
సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధిశెట్టి, రాశి ఖన్నా నటిస్తున్న ముక్కోణ ప్రేమకథా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టులిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సిద్దూ మాట్లాడుతూ.. “ట్రైలర్‌లో ఏం చూసారో సినిమాలో కూడా అదే క్యారెక్టర్, టోన్ కనిపిస్తుంది.
టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. టిల్లు ఇన్నోసెంట్. బట్ ‘తెలుసు కదా’ అలా కాదు. ఇంటెలిజెంట్ క్యారెక్టర్. వరుణ్ పాత్ర చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఇది యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే సినిమా” అన్నారు. కథానాయిక రాశిఖన్నా మాట్లాడుతూ.. “ఇదొక రాడికల్ సినిమా అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత టిల్లుని మరిచిపోతారు. అంత నమ్మకం ఉంది” అని చెప్పింది. మరో కథానాయకి శ్రీనిధిశెట్టి మాట్లాడుతూ.. “ట్రైలర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది.
ట్రైలర్ చూసిన తర్వాత చాలా రాడికల్‌గా అనిపించింది. సినిమా కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని తెలిపింది. డైరెక్టర్ నీరజ మాట్లాడుతూ.. “ఇది నా ఫస్ట్ ఫిలిం. చాలా స్పెషల్. మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా స్పెషల్. ట్రైలర్‌లో కన్నా పది రెట్లు సినిమాలో ఉంది” అన్నారు. నిర్మాత కృతి మాట్లాడుతూ.. “తెలుసు కదా చాలా స్పెషల్ ఫిలిమ్. ఈ కథ వినగానే నచ్చింది. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్న టీమ్ విషయంలో ప్రౌడ్‌గా ఉంది” అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు వైవా హర్ష, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్‌రెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.