calender_icon.png 20 May, 2025 | 7:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ మాట వింటారా?

20-05-2025 01:39:19 AM

రష్యా పూర్తి స్థాయిలో దురాక్రమణకు ముందుకు కదిలిన తర్వాత, 2022 ఫిబ్రవరి నుంచి మొదటిసారిగా రష్యా, ఉక్రెయిన్ అధికారులు మొన్న తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో కలుసుకొని చర్చలు జరిపారు. రెండు దేశాలు చర్చలు జరిపాయంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకరంగా సాగుతున్న యుద్ధం పరిసమాప్తమవుతుందని ఎవరూ ఆశపడలేదు.

ఈ యుద్ధం అంతమవడం ఎలావున్నా, కనీసం కాల్పుల విరమణ కూడా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తాము కాల్పులు విరమించాలంటే ఉక్రెయిన్ తన సొంత భూభాగాల నుంచే సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని రష్యా షరుతు విధిస్తున్నది. ఇస్తాంబుల్ చర్చల్లోనూ ఈ విషయం ఒక కొలిక్కి రాలేదు. వెయ్యిమంది యుద్ధ ఖైదీలను ఇచ్చిపుచ్చుకొనేందుకు అంగీకారం కుదుర్చుకొని గంట నలభై నిమిషాల్లోనే రెండు దేశాలు ముక్తసరిగా చర్చలు ముగించాయి.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకొని కాలయాపన చేసేందుకు రష్యా ఇలాంటి చర్చలకు సరేనంటున్నదనేది దౌత్యవర్గాల అంచనా. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్, తాను నిర్ణయాత్మకంగా చర్చలకు దిగితేగాని రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపునకు రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఆహ్వానించకుండా పుతిన్‌తో ట్రంప్ ముఖాముఖి చర్చలు జరిపినా ప్రయోజనం శూన్యం.

సోమవారం తను పుతిన్ ఫోన్‌లో మాట్లాడతానని, అవసరమైతే జెలెన్‌స్కీతోనూ చర్చిస్తానని ట్రంప్ చెప్పుకొన్నా.. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.యుద్ధం మొదలయినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా రష్యా ఆదివారం ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది. దౌత్యపరంగా వాషింగ్టన్ తగిన సహకారాన్ని అందిస్తే తప్ప పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరించరని జెలెన్‌స్కీ భావిస్తున్నారు.

యుద్ధం పరిసమాప్తి మాట ఎలావున్నా నయాన్నో భయాన్నో ఉక్రెయిన్‌తో అమెరికాకు అవసరమైన ఖనిజ ఒప్పందం పనిని ట్రంప్ ముగించుకున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా వున్న యూరోపియన్ దేశాలు, మాస్కో ఈసారి కాల్పుల  విరమణకు అంగీకరించక-పోతే రష్యాపై కొత్తగా మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ దేశాధినేతాలు గతవారం కీవ్‌లో పర్యటించారు కూడా. ఈ పరిస్థితుల్లో తాము తగ్గేది లేదన్నట్టుగా రష్యా తాజాగా 273 డ్రోన్లతో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై దాడులు చేసింది.

కనీసం 30 రోజుల పాటు తక్షణం కాల్పుల విరమణ జరగాలని ట్రంప్ చేస్తున్న ప్రతిపాదనకు జెలెన్‌స్కీ  అంగీకరిస్తున్నా, కీవ్‌కు యూరోపియన్ దేశాల ఆయుధాల సరఫరా ఆపాలనే షరతుతో సహా మాస్కో అనేక షరతులు విధిస్తున్నది. 2014 ఉక్రెయిన్ విప్లవ కాలం నుంచి రెండు దేశాల మధ్య తలెత్తిన అన్ని సమస్యల మూలాల్లోకి వెళితేగాని ఈ యుద్ధం ఆగదనే ధోరణిని మాస్కో కొనసాగిస్తున్నది.

నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదని కూడా లీగల్ గ్యారంటీ ఇవ్వాలని రష్యా పట్టుబడుతున్నది. ఉక్రెయిన్ అంతర్భాగంగా వున్న క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పటి నుంచి రెండు దేశాల మధ్య విద్వేషాలు కొనసాగుతూనే వున్నాయి. యుద్ధం అంతానికి, లేదంటే కాల్పులు విరమించుకొనేందుకైనా ట్రంప్ దౌత్యం ఫలిస్తుందా.. అనేది వేచి చూడాల్సిందే.