calender_icon.png 20 May, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీవి మొసలి కన్నీళ్లు

20-05-2025 01:27:26 AM

  1. మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాకు సుప్రీం చివాట్లు
  2. ఆర్మీ అధికారి కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం
  3. ముగ్గురు ఐపీఎస్‌లతో సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీకి ఆదేశం

న్యూఢిల్లీ, మే 19: ‘క్షమాపణలు ఎక్కడ చెప్పారు? ఎలా చెప్పారు? సారీ చెబుతున్న ప్పుడు అందులో కొంత అర్థం ఉండాలి. కొన్నిసార్లు న్యాయవిచారణ తప్పించుకునేం దుకు కొందరు మర్యాదపూర్వకంగా మాట్లా డినట్లు నటిస్తారు. మరికొన్నిసార్లు మొసలి కన్నీరు కారుస్తారు. ఇందులో మీ క్షమాపణ ఎలాంటింది. ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నా అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏమిటీ?’ అని మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు.

ఆర్మీ అధికారి కర్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్‌షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈవిషయంలో మంత్రి క్షమాపణలను అంగీకరించలేమన్న అత్యున్నత న్యాయస్థానం మంత్రి వ్యాఖ్యలపై ముగ్గురు ఐపీఎస్‌లతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరపాలని ఆదేశించింది.

విజయ్‌షా ప్రజాప్రతినిధిగా ఉన్నారని, అలాంటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతీ పదాన్ని ఆచితూచి మాట్లాడాలని, ఆయన మాట్లాడిన వీడియోను చూశామని, చాలా అభ్యం తరకరంగా మాట్లాడారని, ఆ వ్యాఖ్యల పట్ల యావత్ దేశం సిగ్గుపడుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం మంగళవారం ఉదయం 10గంటల్లోపు సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐపీఎస్‌లు అందులో ఉండాలని, వారిలో ఒకరు ఎస్పీ ర్యాంకు కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది.

  ఈనెల 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు పేర్కొంది. అయితే ప్రస్తుతానికి మంత్రికి అరెస్ట్ నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు విచారణకు సహకరించాలని ఆయన్ను ఆదేశించింది. తదుపరి పరిణామాలను ఎదుర్కొవాలని నొక్కిచెప్పింది. అలాగే మంత్రిపై చర్యలు తీసుకొని ఉండాల్సిందని పేర్కొంటూ.. కోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ‘ఈ కేసును మేం నిశితంగా పరిశీలించాలనుకుంటున్నాం..ఇది మీకు ఒక లిట్మస్ పరీక్ష’ అని కోర్టు ప్రభుత్వానికి తెలిపింది. 

పహల్గాం దాడులు, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సైనికాధికారి కర్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌షా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఖురేషీని విజయ్‌షా ‘ఉగ్రవాదుల సోదరి’గా పేర్కొనడాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు..ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ మంత్రి సుప్రీంను ఆశ్రయించగా..ఆయన క్షమాపణలు చెప్పాలని గత విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.