15-07-2025 12:32:59 AM
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో పనిచేస్తున్న 116 మంది ప్రొఫెసర్ల బదిలీలు చేపట్టిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బీ నరహరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ లాలూ ప్రసాద్ రాథోడ్, కోశాధికారి డాక్టర్ మహమ్మద్ ఖాజా రవూఫుద్దీన్ సోమవారం డీఎంఈ డాక్టర్ నరేంద్రకుమార్‌కు వినతిపత్రం అందించారు. జిల్లాల్లో 3 నుంచి 9 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రొఫెసర్లకు ముందు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో అవకాశం కల్పించాలని కోరారు.
ఇందుకు ప్రత్యేక జీవో ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కాకుండా ఫిజికల్ కౌన్సెలింగ్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టాలని కోరారు. అలా చేస్తేనే దీర్ఘకాలికంగా నగరానికి దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న ప్రొఫెసర్లకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల సీనియారిటీ జాబితాను కూడా వారు సమర్పించారు.