calender_icon.png 2 September, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలలు నిండని శిశువుకు ప్రాణదానం

02-09-2025 01:00:42 AM

కిమ్స్ కడల్స్ బృందం మరో ఘనత

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): గుజరాత్‌లోని సూరత్‌లో ఉంటున్న ఓ తెలుగు కుటుంబంలోని గర్భిణికి ఏడో నెలలోనే మగబిడ్డ పుట్టాడు. 1.1 కిలోల బరువు మాత్రమే ఉన్న ఆ శిశువుకు.. అనేక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తాయి. తీవ్రమైన సెప్సిస్, ఊపిరి అందకపోవడం, శరీరంలో పలు అవయవాలు పనిచేయకపోవడం లాంటివి వచ్చాయి. దాంతో అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించడం మొదలుపెట్టినా ఫలితం లేకపోవడంతో ఆ బాబు తండ్రి సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిని సంప్రదించారు.

ఎయిర్ అంబులెన్సులో తీసుకొద్దామని ప్రయత్నించినా, ఆ తండ్రి ఆర్థిక ఇబ్బందుల కారణంగా రోడ్డు మార్గంలో తీసుకురావాల్సి వచ్చింది. అలా తీసుకొచ్చిన బృందానికి మార్గదర్శకత్వం వహించి, ఇక్కడ ఆ బాబుకు చికిత్స అందించి, పూర్తిగా కోలుకునేలా చేసిన కిమ్స్ కడల్స్ ఆస్పత్రి క్లినికల్ డైరెక్టర్, చీఫ్ నియో నాటాలజిస్ట్ డాక్టర్ బాబు ఎస్. మదార్కర్ ఇందుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

“1300 కిలోమీటర్ల దూరం ఉండడంతో సుమారు 14-16 గంటల ప్రయాణం అవుతుంది. అంతసేపూ బాబును వెంటిలేటర్ మీదే ఉంచాలి. అందుకు చాలా ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందుకోసం బాబును తీసుకొచ్చే అంబులెన్సే కాకుండా, వెనకాల మరో అంబులెన్సును కూడా పెట్టాం. అందులో ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. దారిలో నాసిక్లోను, మరికొన్నిచోట్ల సిలిండర్లు మార్చుకున్నాం.

మధ్యమధ్యలో బాబుకు శ్వాసపరమైన ఇబ్బంది, గుండె కొట్టుకునే రేటు మారడం లాంటి సమస్యలు తలెత్తాయి. అయినా నిపుణులైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కూడా అంబులెన్సులో ఉండడంతో వెంటనే వాటిని సరిచేయగలిగారు. ఈ బృహత్ ప్రయత్నంలో మొత్తం 31 మంది సిబ్బంది పాల్గొన్నారు. 15 మంది వైద్యులు, నర్సులు, బయోమెడికల్ సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది, 11 మంది బ్యాక్ ఎండ్ నిపుణులు, ఐదుగురు పరోక్ష సహాయ సిబ్బం ది ఉన్నారు.

ఇక్కడకు వచ్చిన తర్వాత పరీక్షిస్తే, బాబుకు మల్టీ ఆర్గాన్ సమస్యలు ఉన్నాయి. దాంతో ఇక్కడ మంచి చికిత్సలు అందించాం. దాదాపు రెండు నెలల పాటు బాబును ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేశాం. దాంతో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. 1.9 కిలోల బరువుకు చేరుకున్నాడు. వెంటిలేటర్, ఆక్సిజన్ తీసేసినా సాధారణంగానే ఉన్నాడు. తల్లిపాలు తాగుతున్నాడు.

ప్రపంచంలో ఇప్పటివరకు ఇలా రోడ్డుమార్గంలో నెలలు నిండని శిశువులను తీసుకొచ్చిన గరిష్ఠ దూరం కేవలం 723 కిలోమీటర్లు మాత్రమే. అదే మన దేశంలో అయితే అది 513 కిలోమీటర్లే. అందువల్ల ఇది గిన్నిస్ రికార్డు అవుతుంది అని డాక్టర్ బాబు ఎస్. మదార్కర్ వివరించారు. బాబును తీసుకొచ్చిన బృందంలో డాక్టర్ సతీష్, డాక్టర్ రియాన్, డాక్టర్ సంతోష్, చిన్నా బ్రదర్, సనల్ బ్రదర్, అంబులెన్సు పైలట్లు ఆనంద్, మోహ న్ తదితరులు ఉన్నారు.

ఆస్పత్రితోపాటు కిమ్స్ ఫౌండేషన్ తరఫున సహాయం అందించిన సీఎండీ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, ఆస్పత్రి సీఈఓ డాక్టర్ అభినయ్ బొల్లినేని తదితరులందరికీ బాబు తండ్రి కృతజ్ఞ తలు తెలిపారు. తన బాబును కంటికి రెప్పలా కాపాడి, క్షేమంగా అప్పగించిన కిమ్స్ యాజమాన్యానికి, వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.