02-09-2025 01:03:06 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): నగరంలోని చెరువుల పునరుద్ధ రణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధి పను ల్లో వేగం పెంచాలని, ఈ వర్షాకాలంలోనే వాటికి పూర్వ వైభవం తీసుకురావాలని స్పష్టం చేశారు. సోమవారం ఆయన సున్నం, ముష్కి చెరువులను క్షేత్రస్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని సమీక్షించారు.
సున్నం చెరువులో పేరుకుపోయిన చెత్తాచెదారం, డెబ్రీస్‌ను తొలగించే పనులను పర్యవేక్షించిన కమిషనర్, చెరువులోకి వరద నీరు సాఫీగా చేరేందుకు వీలుగా తక్షణమే ఇన్‌లెట్లను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికా రులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుం చి వచ్చే వరద నీటికి ఆటంకాలు కలుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో, ఇన్‌లెట్ల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని హైడ్రా కమిషనర్ సూచించారు.
అలాగే, మురుగునీటిని మళ్లించే పనులను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్‌ఆర్ కింద పలు సంస్థలు వెచ్చిస్తున్న నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం కావాలని కమిషనర్ స్పష్టం చేశారు. నార్సింగి వద్ద ‘తత్వ రియల్ ఎస్టేట్’ సంస్థ సీఎస్‌ఆర్ కింద అభివృద్ధి చేస్తున్న ముష్కి చెరువును ఆయన పరిశీలించారు. చెరువు బండ్ పేరుతో ఎఫ్‌టీఎల్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పోసిన మట్టిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.
పనుల్లో జాప్యం జరిగితే, హైడ్రాకు చెందిన యంత్రాలను రంగంలోకి దించి మట్టి ని తొలగించాలని అధికారులకు సూచించా రు. ఈ సందర్భంగా స్థానికులు కమిషనర్‌ను కలిసి, చెరువులోకి మురుగునీరు కలవకుండా చూడాలని, బండ్‌పై పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాకింగ్ ట్రాక్, పార్కును అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21న ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాల నాటికి అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి కావాలని కమిషనర్ డెడ్‌లైన్ విధించారు. చెరువు చుట్టూ ప్రజలు సేదదీరేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
పాతబస్తీలోని బమృక్‌నుద్దౌలా చెరువు పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. మొదటి విడతలో చేపట్టిన ఆరు చెరువులలో కూకట్‌పల్లి నల్లచెరువు, బతుకమ్మ చెరువు పనులు దాదాపు పూర్తికాగా, మిగిలిన చెరువుల పనులను కూడా ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
హైడ్రా ప్రజావాణికి 43 ఫిర్యాదులు
హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 43 ఫిర్యాదులు వచ్చాయి. ఆ అర్జీలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, తక్షణమే విచారణ జరిపి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శేరిలింగంపల్లి, గోపన్నపల్లిలోని చిన్న, పెద్ద చెరువులను కబ్జాదారులు కబళిస్తున్నారని ‘ముప్పాస్ గ్రీన్ గ్రాండ్యుర్ వెల్ఫేర్ అసోసియేషన్’ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇలా వివిధ ప్రాంతాల్లో జరిగిన ౪౩ కబ్జాలపై హైడ్రా ప్రజావాణిలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు.