02-09-2025 12:57:01 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ (విజయక్రాంతి): మిస్ అండ్ మిసెస్ బెలెజా తెలంగాణ గ్రాండ్ ఫినాలే సీజన్ గ్రాండ్ ఫినాలే సోమవారం సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో నిర్వహించారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నెరళ్ల మల్యాద్రితో బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి, మిస్ ఇండియా ఏషియా పసిఫిక్, సోషలైట్ సుధా జైన్, టీమ్ సభ్యులు గుర్జీత్, సమ్రీన్, మహిళా సాధికారత న్యాయవాది, వ్యూహాత్మక వ్యాపార సలహాదారు నందిని ప్రారంభించారు.
యువతులతో పాటు వివాహిత మహిళలు వయ్యారాల నడకలతో కనువిందు చేశారు. వీరిలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 20 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. జ్యూరీ సభ్యులుగా వ్వహరించిన డాక్టర్ సుధా జైన్, వందన దాసరి, నందిని పోటీ పడ్డ వారు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం, నడక, నడత, శక్తియుక్తులను విశ్లేషణ ఆధారంగా విజేతలను ప్రకటించారు.
విజేతగా డి కావ్యాంజలి, ఫస్ట్ రన్నర్-అప్‌గా కందకట్ల ప్రత్యూష, సెకండ్ రన్నరప్‌గా వి. జానకీ దేవి ఎంపికయ్యారు. మిసెస్ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్‌గా డా. పి. నిఖిలారెడ్డి, సెకండ్ రన్నరప్‌గా అవుల రేవతి నిలిచారు. బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కాదు, మహిళలకు సాధికారత కల్పించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందన్నారు.
బెలెజా బ్రాండ్ అంబాసిడర్ డా. సుధా జైన్ మాట్లాడుతూ.. బెలెజా అనేది ఒక అందాన్ని ప్రదర్శించే వేదిక మాత్రమే కాదు. ఇది అవకాశాలను కల్పించే, నేర్చుకునే, నేర్చుకున్న విషయాలను అమలు చేయడంలో సహాయపడే శక్తివంతమైన వేదిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్మన్, సినీ నిర్మాత డాక్టర్ మీర్ షేర్ అలీ ఖాన్, ఫ్యాషన్ డిజైనర్లు రూమా జైన్, సుమారావు, హ్యాంపర్ భాగస్వాములు సత్వయా, మూలం హాజరయ్యారు.