20-11-2025 12:25:33 AM
రాష్ట్రంలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి జూపల్లి
నాగర్ కర్నూల్ నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు వేగంగా, సజావుగా జరుగుతున్నాయని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ మండలాల్లోని అయ్యవారిపల్లి, కొప్పునూర్, ఎన్మనబెట్లు గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్చేజ్ సెంటర్లను బుధవారం ప్రారంభించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో తూడుకుర్తి, శ్రీపురం, బిజినపల్లి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏ గ్రేడ్ వరికి క్వింటాలకు రూ.2389, సాధారణ రకానికి రూ.2369 మద్దతు ధర, సన్న రకాలకు రూ.500 బోనస్ కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, మధ్యవర్తులకు లొంగి మోసపోవద్దని సూచించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతాయని, 17% తేమ ఉన్న ధాన్యాన్ని తప్పనిసరిగా కొనాలని అధికారులు స్పష్టం చేశారు. తూకం తర్వాత వెంటనే రసీదు ఇవ్వాలని, మిల్లులకు తరలింపు బాధ్యత పూర్తిగా పౌర సరఫరాలువ్యవసాయ శాఖలదేనని మంత్రి పేర్కొన్నారు.