calender_icon.png 26 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిప్పులు కక్కుతూ నింగిలోకి

26-09-2025 01:21:56 AM

  1. రైలుపై నుంచి అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం
  2. డీఆర్డీవో, మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
  3. అత్యాధునిక ఫీచర్లతో తయారీ
  4. డీఆర్డీవోను అభినందించిన రక్షణమంత్రి
  5. అగ్ని ప్రైమ్ పరిధి రెండు వేల కిలోమీటర్లు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: రక్షణశాఖ అమ్ముల పొదిలో మరో అధునాతన క్షిపణి చేరింది. దీంతో మన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతంగా తయారైంది. రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణిని గురువారం ఒడిశా తీరం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. తొలిసారిగా రైలు మీద నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

ఈ క్షిపణి పరిధి 2,000 కి.మీ. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోని ఎక్స్ వేదికగా అభినందించారు. క్షిపణికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘ప్రత్యేకంగా డిజైన్ చేసిన రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ నుంచి తొలిసారి క్షిపణి ప్రయోగం చేపట్టాం.

రైల్ నెట్‌వర్క్ సాయంతో ఎటువంటి ముందుస్తు ఏర్పాట్లు లేకున్నా దేశంలో ఎక్కడికైనా వేగంగా తరలించేందుకు వీలుంటుంది. తక్కువ సమయంలో శత్రువుల కంట పడకుండా ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు’ అని వెల్లడించారు. 

అధునాతన ఫీచర్లివే.. 

విజయవంతంగా పరీక్షించిన అగ్ని ప్రైమ్ క్షిపణిలో ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ క్షిపణిలో రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనర్షల్ నేవిగేషన్, మైక్రో ఇనర్షల్ నేవిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవే కాకుండా జీపీఎస్, నావిక్ శాటిలైట్ నేవిగేషన్లను కూడా వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ మిసైల్‌కు ఉన్న కెనిస్టర్ డిజైన్ కారణంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులభంగా రవాణా చేసి భద్రపరచొచ్చు.

లాంచింగ్‌కు అవసరం అయిన సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. గతంలో చేసిన అనేక పరీక్షల్లో అగ్ని ప్రైమ్ క్షిపణి విజయవంతం అయి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. గత నెలలో భారత్ పృథ్వి అగ్ని మిస్సైల్స్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణులను కూడా డీఆర్డీవోనే రూపొందించడం గమనార్హం. గతంలో భారత్ ప్రయోగించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని దాదాపు ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదిస్తుంది.