calender_icon.png 19 November, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ పరంగా ఇచ్చే భిక్షం మాకొద్దు

19-11-2025 12:00:00 AM

  1. సర్పంచ్ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాం
  2.   42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయని కాంగ్రెస్, బీజేపీలను ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం
  3. రేపటి నుంచి రాష్ర్టవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు
  4. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

ముషీరాబాద్, నవంబర్ 18 (విజయక్రాం తి): పార్టీ పరంగా కాంగ్రెస్ ఇచ్చే బీసీ రిజర్వేషన్ల భిక్షను బీసీ సమాజం అంగీకరించబో దని, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతామని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ అభినందన్ గ్రాండ్స్‌లో బీసీ జేఏసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా ఇవ్వాలన్న నిర్ణయా న్ని రాష్ర్టంలోని బీసీలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడకపోతే రాష్ర్టంలో అగ్గిపుట్టిస్తామని హెచ్చరించారు.

ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన మూడు గంటల్లోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలకు వెళ్తామని ప్రకటించడం చూస్తే బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఆ రెండు పార్టీలు కుమ్మక్కు అడ్డుకుంటున్నారని అర్థమవుతోందని ఆరోపించారు.  ఈ రెండు పార్టీలను బీసీలు బీసీ ద్రోహులుగా ప్రకటించి రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలో ఉధృతం చే యాలని పిలుపునిచ్చారు.

రూ.3వేల కోట్ల నిధులు ఆగిపోతున్నాయి కనుక సర్పంచ్ ఎన్నికలకు వెళ్దామంటున్న రాష్ర్ట ప్రభుత్వం.. రూ.2.40లక్షల కోట్ల రాష్ర్ట బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు ఒక్క శాతం కూడా కాదని, మెగా కృష్ణారెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంట్రా క్ట్ కంపెనీలకు ఇచ్చిన దాంట్లో రూ.3వేల కోట్లు ఆవగింజ కూడా కాదని తెలిపారు.

ప్రభుత్వానికి 3వేల కోట్లే ప్రాధాన్యత అనుకుంటే రాష్ర్టంలోని మూడు కోట్ల మంది బీసీలను ఒక్కొక్క రూపాయి భిక్షం అడిగి ప్రభుత్వానికి ఇస్తామని, సర్పంచ్ ఎన్నికలు మాత్రం నిర్వహించొద్దన్నారు. పార్టీ గుర్తులు లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలలో 42% పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించ డం విడ్డూరంగా ఉన్నదన్నారు. 

రెడ్ల రాజ్యం తేవాలనే ప్రయత్నం

పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటే కులగణన ఆధారంగా 60 శాతం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. 42 శాతం బీసీలకు ప్రకటిం చి సగం మంది అగ్రకులాలను ఇండిపెండెంట్‌లుగా పోటీ చేయించి అంతిమంగా బీసీల ను రాజకీయంగా ఓడించి సర్పంచ్ నుంచి సీఎం దాకా రెడ్ల రాజ్యం తేవాలనే ప్రయత్నం లో ఉన్నారని ఆరోపించారు. రాష్ర్ట ప్రభుత్వనికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిపై ఒత్తిడి పెంచాలని, ఇండియా కూట మి ఎంపీల ద్వారా డిసెంబర్ మొదటివారం నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి  ఆమోదించుకోవాలని డిమాండ్ చేశారు.