19-11-2025 12:00:00 AM
బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ డి జానకి
జడ్చర్ల, నవంబర్ 18 : శ్రీ సలాసర్ బాలాజీ టెకస్ట్ టైల్ లో పివిటీ లిమిటెడ్ కంపెనీ లో అగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడంతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లులో చోటు చేసుకుంది. గొల్లపల్లి వద్ద ఉన్న జిన్నింగ్ మిల్లులో ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది కార్మికులు నిత్యం పనిచేస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించింది.
ఇదే సమయంలో మిల్లులోని బయటికి గాలి వచ్చి పైపు లైన్ లో చెత్త ఇరుక్కుందని వాటిని తొలగించేందుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన పప్పు (26), బీహార్ రాష్ట్రానికి చెందిన హరేందర్( 23 )వెళ్లారు. ఈ క్రమంలో అటుపక్క అంటుకున్న మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో ఇద్దరు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరికీ ఇటీవలే వివాహం అయిందని తోటి కార్మికులు తెలిపారు.
ఈ ఘటనతో బీహార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు కంపెనీ యజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ యజమాన్యం పై దాడికి దిగారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు అదనపు బలగాలను కంపెనీ వద్దకు రప్పించారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించి నిరసన కారులను చెదరగొట్టారు. ఈ ఘటన జరిగినకు గల కారణం తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ డి జానకి ప్రత్యేకంగా పరిశీలించారు.