11-02-2025 12:00:00 AM
ఉచిత క్యాంపు నిర్వహణపై సిద్దిపేట ఏసీపీ మధు ప్రశంస
సిద్దిపేట, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట ఏసిపి మధు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని సిటీ న్యూరో ఆస్పత్రి, హైదరాబాద్ వెల్నెస్ ఆసుపత్రిల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత గుండె పరీక్షల క్యాంపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వెంటనే వైద్యులకు సంప్రదించాలన్నారు.
ప్రతిరోజు యోగ, వాకింగ్ చేయడంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ మధ్యకాలంలో గుండెపోటు లాంటి సమస్యలు రావడంతో చాలామంది ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు వైద్య సేవలందించడం అభినందనీయమన్నారు. సుమారు 400 మందికి గుండెకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేయగా ఇందులో 26 మంది గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిటీ న్యూరో ఆసుపత్రి వైద్యులు హకిమ్, మేనేజింగ్ డైరెక్టర్ బౌగోళ శ్రీకాంత్, హైదరాబాద్ వెల్నెస్ ఆసుపత్రి గుండె వైద్య నిపుణులు డాక్టర్ పవన్ బట్నాకర్, డాక్టర్ సామియుల్, వెల్నెస్ ఆసుపత్రి జనరల్ మేనేజర్ టి ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.