11-02-2025 12:00:00 AM
మెదక్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓట్ల వేట జోరందు కుంది.. ఎన్నికల నామినేషన్ల పక్రియ సోమవారంతో ముగిసింది. పరిశీలన, ఉప సంహరణ ప్రక్రియ ఈనెల 13తో ముగు స్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా అదృష్టం పరీక్షించు కునేందుకు బరిలో దిగుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్‌కు ముందు నుంచే ప్రచారం..
ఎమ్మెల్సీ బరిలో నిలిచే అభ్యర్థులు నోటి ఫికేషన్ ముందు నుంచే ఉమ్మడి జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో నిలిచే అభ్యర్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళి మద్దతు కోరారు. ఇక పట్టభద్రులతో సభలు, సమా వేశాలు నిర్వహించారు. ఇక నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో నామినేషన్లు వేసి ఓట్ల వేటలో పడ్డారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న ఓటర్లను కలుస్తూ మద్దతు కోరుతున్నారు.
ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆది లాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉండడంతో విస్తృతంగా చుట్టేస్తున్నారు. బీజేపీ నుంచి పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న మల్క కొమురయ్య ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ప్రచారం మొదలు పెట్టారు.
స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు, నాయకులతో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పట్టభద్రుల స్థానానికి పోటీకి దిగిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అలాగే టీచర్స్ స్థానినిక పోటీ చేస్తున్న కూర రఘోత్తమ్రెడ్డితో పాటు పట్టభద్రుల స్థానానికి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచార స్పీడును పెంచారు.
ఖరీదవుతున్న ఎన్నికలు..
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత ఖరీదైన ఎన్నికలుగా మారాయి. గత ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవ్ర నెడ్డి గెలుపొందారు. ఉపాధ్యాయుల ఎమ్మె ల్సీగా కూర రఘోత్తమ్రెడ్డి విజయం సాధిం చారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది అసక్తిగా మారింది. అభ్యర్థుల మధ్య పోటీ పెరగ డంతో విజయంపై ఉత్కంఠ పెరుగుతోంది.
ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో అభ్యర్థులకు ఖర్చులు సైతం తడిసి మోపడవుతున్నాయి. అభ్యర్థులు సైతం రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈసారి పలువురు వ్యాపారులు, రాజకీయ బలం ఉన్నవారు బరిలో ఉన్నారు. దీంతో ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికలకంటే ఈసారి ఖర్చు పెరుగుతోంది. ఎలాగైనా గెలవాలని ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు భారీగానే ఖర్చు చేస్తున్నారు.