10-08-2025 01:45:11 AM
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇష్టం లేక సమస్య పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కేంద్రంపై నెట్టి తప్పించుకొనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన 18 బిసి సంఘాల సమావేశానికి ఎంపీ ఆర్.కృష్ణ య్య ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టి పరిస్థితులలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలన్నా రు. ప్రభుత్వం ఘర్షణ వైఖరితో కాకుండ ప్రత్యామ్నాయ పద్ధతి ఆలోచించి రిజర్వేషన్లు పెంచే మార్గాలు ఆలోచించాలని కోరారు. బీసీ రిజర్వేషన్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పద్దతి ప్రకారం ప్రయత్నించడం లేదన్నారు.
ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. బీసీని దేశ ప్రధానిని చేసిన బిజెపి పార్టీ బీసీలకు వ్యతిరేకం కాదన్నారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో కుల గణన చేసిన బిజెపి చరి త్ర సృష్టించిందని, 27 మంది బీసీలకు కేంద్ర మంత్రులుగా, ఎస్సి, ఎస్టీ, బీసీలకు ఉన్నత పదవులు అవకాశం కల్పించింద న్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే కేంద్రంపై యుద్ధం ప్రకటించి ధర్నాలు చేస్తే సరిపోదని, బీసీ సంఘాలు, ప్రజా సంఘా లు అఖిలపక్షంతో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిష్కరించాలని కోరారు.
కేంద్ర మంత్రులను విమర్శించడం లాం టి చర్యలు రిజర్వేషన్లు సాధించడానికి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ సాధించడానికి మార్గాలు వెతకాలన్నారు. ఈ కార్యక్రమంలో సీ.రాజేందర్, భూపేష్ సాగర్, ర్యాగ రమేష్, నిఖిల్ పటేల్, మోదీ రాందేవ్, రమాదేవి, చిక్కుడు బాలయ్య, ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.