calender_icon.png 10 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లాభాల వాటా ఇంకెప్పుడు?

10-08-2025 12:41:35 AM

  1. సింగరేణి కార్మికులకు ఏటా తప్పని ఎదురుచూపులు
  2. 35శాతం ఇవ్వాలని డిమాండ్ 
  3. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రకటించాలని వినతి
  4. కొత్త ప్రభుత్వం వచ్చినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన

మందమర్రి, ఆగస్టు 9: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ, తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి సంస్థలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన ఆనవాయితీనే కొనసాగుతుండటంపై కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరినట్లుగానే సింగరేణి కార్మికులు సైతం మార్పు కోరి గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో  టీబీజీకేఎస్‌ను కాదని ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా గెలిపించారు.

అయినప్పటికీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని సింగరేణి యాజమాన్యం అనుసరిస్తుండటంతో కార్మిక వర్గం తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనవుతోంది.

సింగరేణిలో కానరాని మార్పు..

మార్పును కోరుతూ ఏఐటీయూసీకి పగ్గాలు అందించినా కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల న్యాయమైన డిమాండ్‌లైన ఆదాయ పన్ను మాఫీ, సొంతింటి కల సాకారం, పేరక్స్‌పై ఆదాయ పన్నును సింగరేణి యాజమాన్యం భరించడం వంటి వాటితో పాటు కొత్త భూగర్భ గనులను ప్రారంభించడం,

మారుపేర్ల మార్పు తదితర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా గత ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అనుసరిస్తుండటంతో కార్మికులు  ప్రభుత్వం, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

ఏటా తప్పని ఎదురుచూపులు..

సంస్థ సాధించిన లాభాల నుంచి కార్మికులకు 10 శాతం లాభాల వాటా  చెల్లిస్తామని ఉమ్మడి రాష్ట్రంలో 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి అమలు చేశారు. నాటి నుంచి నేటి వరకు ఏటేటా లాభాల వాటా శాతం పెంచుతూ జూన్, జూలై నెలల్లో ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం జూన్, జూలైలోనే లాభాల వాటాను చెల్లించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లాభాల వాటాను దసరా పండుగకు ముందు చెల్లిస్తూ వస్తున్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లోపు చెల్లించేనా..

2024 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు గడిచినప్పటికీ సింగరేణిలో సంస్థ సాధించిన లాభాలను ప్రకటించకపోవడంతో కార్మికులు లాభాల వాటా ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నోటిఫికేషన్ జారీ అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటం మూలంగా లాభాల వాటా ప్రకటన మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్‌కు ముందే లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు వెంటనే చెల్లించాలని కార్మిక వర్గం కోరుతోంది.

35 శాతం వాటాకు కార్మిక సంఘాల పట్టు..

2024- ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన లాభాల నుంచి 35 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతో పాటు ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ, ప్రతిపక్ష కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

గత 2023 ఆర్థిక సంవత్సరంలో 33% వాటాన్ని చెల్లించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు శాతానికి పెంచి 35% కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రతీ సంవత్సరం కార్మికుల లాభాల వాటా ఒక్కో శాతం పెంచుతూ పోతున్న ఆనవాయితీని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 35 శాతం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపు తుందని మెజార్టీ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. 

గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నిర్లక్ష్యం..

గతంలో ఇచ్చిన మాదిరిగా జూన్, జూలై నెలల్లో చెల్లించాల్సిన లాభాల వాటా గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దసరా పండుగ ముందు చెల్లిస్తున్నారు. సంఘాలు లాభాల వాటా కోసం పత్రికా ప్రకటనలకు పరిమితమవుతున్నాయి కానీ సింగరేణి యజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఇప్పటికైనా కార్మికులకు సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి 35 శాతం వాటాను వెంటనే చెల్లించాలి.

 సాంబారు వెంకటస్వామి, సీఐటీయూ బ్రాంచి అధ్యక్షుడు, మందమర్రి