calender_icon.png 10 August, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ.. రాఖీ బాదుడు

10-08-2025 01:26:32 AM

- ప్రత్యేక బస్సుల పేరిట 50% ఛార్జీలు పెంపు

- ఈనెల 11 వరకు పెంపు వర్తింపు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి పర్వదిన సంద ర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరిట బస్సు ఛార్జీలను పెంచుతూ నిర్ణ యం తీసుకుంది. అయితే ప్రయాణికులకు రవాణాపరమైన అసౌకర్యం కలుగ కుండా ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి ఏడాది మాదిరిగానే ప్రయా ణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వ జీవో ప్రకారమే రాఖీ పండుగకు నడిచే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను సంస్థ పెంచినట్లు వివరించారు. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50 శాతం వరకు టికెట్ ధరలను సవరించినట్లు తెలిపారు.

స్పెషల్ బస్సులు మినహా రెగ్యూలర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఈ సవరణ చార్జీలు వర్తిస్తాయని అన్నారు. ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో స్పెషల్ అంటూ డిస్‌ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేసిందన్నారు.

ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోందన్నారు. తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుందని, ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిందని సజ్జనార్ పేర్కొన్నారు.

ఈ జీవో ప్రకారం స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను రాఖీ పండుగ సందర్భంగా సంస్థ సవరించిందన్నారు. రాఖీ పౌర్ణమికి ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు సూచించారు. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సొంతూళ్లకు వెళ్లే వారు తమ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

మహిళా ప్రయాణికుల ఇక్కట్లు

సాధారణంగా రాష్ట్రంలో ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో దాదాపు 67 శాతం మహిళలే ఉంటున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభానికి ముందు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య 45.49 లక్షలుగా ఉంటే ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆ సంఖ్య ఏకంగా 60.08 లక్షలకు చేరుకుంది.

60.08 లక్షల ప్రయాణికుల్లో మహిళల వాటానే  67 శాతంగా ఉంది. ఈ స్థాయిలో పెరిగిన మహిళా ప్రయాణికులు ఏడాది కాలంలో ఎప్పుడు ప్రయాణం చేసినా చేయకపోయినా వారు ఖచ్చితంగా ప్రయాణం చేసే సందర్భమే రాఖీ పౌర్ణమి. ఆ రోజు ఎలాగైనా తమ సోదరుల వద్దకు చేరుకుని రాఖీ కట్టి రావాలని వారు ఎంతో ఎదురుచూస్తారు. అలాంటి పండుగ రోజున దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక్కరైనా ప్రయాణాలు చేస్తుంటారు.

రాఖీపౌర్ణమి సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి దాదాపు 11వ తేదీ వరకు మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తారు. తమ ప్రయాణాల కోసం ఆర్టీసీ బస్సులనే ఆశ్రయించే వారు ఎక్కువ. అయితే మహాలక్ష్మిఉచిత బస్సు పథకం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సెక్కిన మహిళలు స్పెషల్ బస్సుల పేరిట భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై మండిపడుతున్నారు. ఇన్ని రోజులు ఫ్రీగా తిప్పి పండుగ రోజు డబ్బులు వసూలు చేస్తున్నారని అంటున్నారు.

ఇక సాధారణంగానే 67శాతం ఉండే మహిళా ప్రయాణికుల సంఖ్య రాఖీ సందర్భంగా సుమారు 80శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సాధారణ వేళల్లోనే బస్సుల కోసం కొట్లాడే పరిస్థితి ఉంటే ఇక స్పెషల్ బస్సుల పేరిట ప్రత్యేక ఛార్జీలు ఉన్న సందర్భంగా చాలా మంది మహిళలు ఎదురుచూసి మరీ ఫ్రీ బస్సు ఎక్కేందుకే ప్రాధాన్యం ఇవ్వడంతో బస్సులన్నీ కిటకిటలాడాయి.